ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ భారత్ లో విస్తరించేందుకు కుట్రలు చేస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ హెచ్చరించింది. ఆన్ లైన్ లో నిరంతరం ప్రచారం చేస్తూ భారత యువతకు గాలం వేస్తోందని వెల్లడించింది. మొత్తం 37కేసులు విచారించి ఈ విషయాన్ని బయటపెడుతున్నామని ఎన్ఐఏ తెలిపింది. సమీప ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుమానమొస్తే 011-24368800కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరింది.

మరోవైపు భారత్ పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. పంజాబ్ లో నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లను గుర్తించిన సైన్యం కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆ డ్రోన్లు తిరిగి పాక్ వైపు వెళ్లిపోయినట్టు చెప్పారు. డ్రోన్లు సంచరించిన ప్రాంతాన్ని భద్రతా దళాలు తనిఖీ చేశాయి. గత కొద్ది రోజులుగా పంజాబ్ లో డ్రోన్ల సంచారం పెరిగిన కారణంగా.. సీఎం అమరీందర్ సింగ్ హై అలర్ట్ ప్రకటించారు.

ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కౌన్సిల్ లో పాక్ పై భారత్ మండిపడింది. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కు ఘాటుగా సమాధానమిచ్చింది. విఫల దేశం పాక్ నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో భారత్ లేదని చెప్పింది. ఉగ్రవాదులకు పాక్ బహిరంగంగా మద్దతిస్తూ.. ఆర్థిక సాయం చేస్తోందని ఆరోపిస్తోంది. ఐక్యరాజ్య సమితి జాబితాలోని టెర్రరిస్టులు సహా.. ఇతర ముష్కరులకూ అండగా నిలిచేలా పాక్ ప్రభుత్వ విధానం ఉందని విమర్శించింది.

ఇక అల్ ఖైదాతో అమెరికాకు ముప్పు పొంచి ఉందని ఆ దేశ నిఘా సంస్థ వెల్లడించినట్టు బ్లూమ్ బర్గ్ ఓ కథనంలో వెల్లడించింది. తాలిబన్ల సంరక్షణలో ఆప్ఘాన్  గడ్డపై అల్ ఖైదా మళ్లీ పుంజుకునే అవకాశముందని పేర్కొంది. రాబోయే రెండేళ్లలో అమెరికాపై దాడులు చేసే ప్రమాదం కూడా ఉన్నట్టు అగ్రరాజ్య నిఘా సంస్థ ప్రతినిధులు చెప్పినట్టు వెల్లడించింది. క్రమంగా అమెరికాను బెదిరించే స్థాయికి అల్ ఖైదా ఎదగనుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిపింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: