మంత్రిపదవి అంటే అదో పెద్ద హోదా. దాని కోసం ఎన్ని పాట్లు అయినా పడతారు. ఎన్ని ప్రయత్నాలు అయినా సరే చేసేందుకు కూడా రెడీ. అవసరమైతే... అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు భజన చేస్తారు... కీర్తనలు పాడతారు... ఇంకా చెప్పాలంటే... ప్రతిపక్ష నేతలపై దాడులకు కూడా రెడీ అవుతారు. ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నట్లున్నారు కృష్ణా జిల్లాకు చెందిన పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు జోగి రమేష్. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వీరాభిమానంతో రాజకీయాల్లోకి వచ్చిన జోగి రమేష్... తొలిసారి పెడన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి... కాగిత వెంకటరావుపై 11 వందల 92 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే అనూహ్యంగా 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న జోగి...  మళ్లీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పెడన నియోజకవర్గం నుంచే వైసీపీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 7 వేల 839 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్‌పై విజయం సాధించారు.

ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి మంత్రిపదవిపై గంపెడంత ఆశలు పెట్టుకున్న జోగి రమేష్... అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. అటు అసెంబ్లీలో, ఇటు బయటా కూడా... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒక దశలో వైఎస్ జగన్‌ను రిజర్వేషన్లు అమలు చేస్తున్న అభినవ అంబేద్కర్ అంటూ కామెంట్ కూడా చేశారు. అసలు జగన్ లాంటి నేత లేడంటే లేడని ఏకంగా శాసనసభలోనే కామెంట్ చేసేశారు కూడా. అదే సమయంలో ప్రతిపక్ష నేతలపై కూడా ఒంటికాలిపై దూకుతున్నారు. నీ సంగతి తేలుస్తాం అంటూ టీడీపీ నేతలపై చాలా సార్లు నోరు పారేసుకున్నారు కూడా. ఇప్పుడు తాజాగా ఎక్కడో విశాఖ జిల్లాలో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏదో అన్నారని... అందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ గోల గోల చేశారు. కరకట్టపైకి ఏకంగా ఓ 20 వాహనాలతో వచ్చిన జోగి రమేష్... ఓ మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి యత్నించారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కరకట్టపై ఆగమాగం చేసిన జోగి రమేష్ చర్య కేవలం అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో రెండు నెలల్లో మంత్రివర్గ కూర్పు ఉన్న నేపథ్యంలో పదవి కోసమే ఈ ప్రయత్నాలన్నీ అని కామెంట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: