ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సగం పదవీకాలం పూర్తి చేసుకున్నారు. తాజాగా ఏపీలో ముందస్తు ఎన్నికల వార్తలు బాగా హల్ చల్ చేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక మరో తొమ్మిది నెలల పదవీకాలం ఉండగానే ఆయన ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకతను ముందుగానే పసిగట్టి ప్రతిపక్షాలు పుంజుకునే అవకాశం లేకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ 2014 కంటే భారీ మెజార్టీతో గెలిచి వరుసగా రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంటే ప్రభుత్వంపై ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందో... ప్రజల్లో చర్చలు నడుస్తున్నాయో ఆ వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి ఆయన ఘన విజయం సాధించారు.

ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం కేసీఆర్ పంథాలోనే ముందుకు వెళ్ల‌నున్నారా ? అంటే వైసిపి వర్గాల్లో అవున‌నే చర్చలు నడుస్తున్నాయి. అయితే తెలంగాణలో పరిస్థితి వేరు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై వైసిపి ఎంపీలు - మంత్రులు ఎమ్మెల్యేల‌ లోనే తీవ్రమైన అసంతృప్తి ఉంది. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉండటం కావచ్చు ... క‌రోనా కారణం కావచ్చు... ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది జరగటం లేదు. కేవలం ప్రభుత్వం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

చివ‌ర‌కు వైసీపీ నేత‌లు ఎంత‌లా మారిపోయారు ? అంటే జ‌గ‌న్‌ను ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నా కూడా కౌంట‌ర్ ఇచ్చేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. తాజాగా టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడినే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవ‌చ్చు. అయ్య‌న్న జ‌గ‌న్‌ను నా కొడుకులు అన‌డంతో పాటు మంత్రుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసినా జోగి ర‌మేష్ లాంటి ఒక‌రిద్ద‌రు నేత‌లు త‌ప్పా ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. జ‌గ‌న్ మాకేం చేయ‌ట్లేదు.. అలాంట‌ప్పుడు మేం ఎందుకు మాట్లాడాల‌న్న‌ట్టుగా వారి తీరు ఉంది. మ‌రి ఇలాంటి నేత‌ల‌తో జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు గ‌ట్టెక్కుతారు ? అన్న‌ది ఆయ‌న‌కే తెలియాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: