రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు బూతులతో నిండిపోయాయి. ఒకప్పుడు రాజకీయం అంటే నేతల మధ్య నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండేవి. ఇప్పుడు బూతులే విమర్శలుగా మారిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ బూతుల రాజ‌కీయం ఇటీవ‌ల ఎక్కువ అవుతున్నా ఏపీలో మ‌రీ శృతి మించుతోంది. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చాకే ఈ బూతుల రాజకీయం పెరిగిందని చెప్పొచ్చు. మరి అధికారంలో ఉన్నాం, తమని ఎవరూ ఏం చేయలేరనే ధీమాతో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రతిపక్షాలపై బూతులతో విరుచుకుపడటం మొదలుపెట్టారు.

అయితే వైసీపీ నేతల బూతులకు అదే విధంగా సమాధానం చెప్పాలని టి‌డి‌పి నేతలు కూడా అనుకున్నట్లు ఉన్నారు. అందుకే ఈ మధ్య కొందరు టి‌డి‌పి నేతలు కూడా అదే స్థాయిలో వైసీపీపై ఫైర్ అవుతున్నారు. తాజాగా టి‌డి‌పి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సైతం జగన్‌పై ఫైర్ అయ్యారు. వైసీపీ స్థాయిలో కాకపోయినా కాస్త పరుష పదజాలంతో దూషించారు. ఇక అయ్యన్న ఇలా మాట్లాడటంపై వైసీపీ నేతలు నీతులు చెబుతున్నారు. అసలు జోగి రమేష్ లాంటి వారైతే ఏకంగా చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. అలా అయ్యన్న మాట్లాడారో లేదో...వరుసపెట్టి వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి, అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిపై ఉచ్చరించరాని పదజాలంతో సంబోధించడం ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడికి సరికాదని అంటున్నారు.

అంటే చంద్రబాబుని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా తిట్టినప్పుడు మాత్రం, ఆ మాటలు సరైనవి అని ఇప్పుడు మాట్లాడే నాయకులు ఫీల్ అవుతున్నారని టి‌డి‌పి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇదే నీతులు చంద్రబాబుని తిట్టేటప్పుడు ఎందుకు గుర్తు పెట్టుకోలేదని అడుగుతున్నారు. అయితే వైసీపీ నేతల వ్యాఖ్యలపై అయ్యన్న మళ్ళీ స్పందించి...తనదైన శైలిలో ర్యాగింగ్ చేశారు. చర్చిలో ఫాదర్...ఓ మై సన్ అంటరాని, అలాగే దాన్ని తెలుగులో నా కొడుకులు అన్నానని అయ్యన్న కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో  నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకోవాలి గానీ, ఇలా బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదనే చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: