ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇద్దరు వైసీపీ నేతలు కలిసినా... ఒకటే టాపిక్ పైన చర్చ. అసలు ఎవరుంటారు... ఎవరు పోతారు... మనం ఎవరి వెంట నడవాలి... మన నేతకు ఆ అదృష్టం ఉందా లేదా... ఇదే అంశం. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో... ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై జగన్ దృష్టి పెట్టారు. అధికారం చేపట్టిన తొలిరోజే పార్టీ నేతలకు స్పష్టం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంత్రులకు రెండున్నరేళ్ల ఛాన్స్ అని చెప్పేశారు. ఆ తర్వాత ఉన్న వారిని తొలగించి.. కొత్త వారికి అవకాశమిస్తామన్నారు జగన్. అన్నట్లుగానే ఈ నెల 16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా సహచర మంత్రులకు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. 80 శాతం మందిని మారుస్తున్నామని... తొలగించిన వారు పార్టీ విజయం కోసం పని చేయాలని ఆదేశించారు కూడా. ఇప్పుడు ఆ 80 శాతం మంది స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే కొనసాగుతోంది.

రాష్ట్రంలో తొలి జిల్లాగా గుర్తింపున్న శ్రీకాకుళం జిల్లాలో మంత్రివర్గ కూర్పుపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. జగన్ వెంట ముందు నుంచి ఉన్న ధర్మాన కృష్ణదాస్‌ ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక అనూహ్యంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత పలాస ఎమ్మెల్యే డాక్టర్ సిదీరి అప్పలరాజు కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే వీరిద్దరిని జగన్ తొలగిస్తారనేది ఇప్పటికే జిల్లాలో టాక్. ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు, రాజకీయాల్లో సీనియర్ నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అయిన ధర్మాన ప్రసాదరావుకు అవకాశం వస్తుందని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో... ఇప్పటి వరకు తమ్ముడు ఉన్నారు కాబట్టి... అన్నకు అవకాశం దక్కే అవకాశం లేదనే మాట కూడా వినిపిస్తోంది.

ఇక సిక్కోలు నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారి జాబితా చాలానే ఉంది. ఎస్సీ కోటాలో  రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎస్టీ కోటాలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ్ కళావతి పోటీ పడుతున్నారు. వీరిద్దరితో పాటు.. టెక్కలి నియోజకవర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్ కూడా మంత్రిపదవి ఆశిస్తున్నారు. అచ్చెన్నాయుడుపై ఒంటికాలితో దూకుతున్న దువ్వాడ అంటే జగన్‌ కూడా మక్కువ చూపుతున్నారు. ఇక పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా మంత్రిగా ఛాన్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత శాసనసభాపతి తమ్మినేని సీతారాం కూడా మంత్రి పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఆరుగురు మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి... అవకాశం ఎవరికి దక్కుతుందో.. ఎవరు బుగ్గ కార్లలో తిరుగుతారో...?

మరింత సమాచారం తెలుసుకోండి: