విశాఖ‌ప‌ట్నానికి రాజ‌కీయంగా ఒక ప్ర‌త్యేక‌త ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వా వీచినా.. విశాఖ న‌గ‌రం ప‌రిధిలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం వైసీపీ జెండా ఎగ‌రలేదు. అయితే.. చిత్రంగా విశాఖ ఎంపీ స్థానం మాత్రం వైసీపీ ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ప్ర‌భుత్వం వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో విశాఖ ప‌రిస్థితి ఏంటి?  తూర్పు, ద‌క్షిణం, ఉత్త‌రం, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు గెలుస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. కీల‌క నేత‌లు అంద‌రూ విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి కనిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. అస‌లు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. సో... ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఇక్క‌డ నుంచి మ‌రో నేత‌ను ఎంచుకోవాలి. పోనీ.. ఇక్క‌డ వైసీపీ బ‌లంగా ఉందా అంటే అదీ లేదు. దీంతో ఎటొచ్చీ.. గ‌తంలో ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు గెలుపు ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీకులు. అదేవిధంగా.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న వాసుప‌ల్లి గ‌ణేష్‌.. వైసీపీలోకి చేరిపోయారు.

ఈయ‌న‌కే వైసీపీ టికెట్ ఇస్తుంది. ఈయ‌న‌కు కూడా ఇక్క‌డ పాజిటివిటీ ఎక్కువ‌గానే ఉంద‌ని అంటున్నారు. సో.. ఇక్క‌డ కూడా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కేది క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రోవైపు.. విశాఖ తూర్పు నుంచి విజ‌యం సాధించిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబుకు ఫిఫ్టీ ఫిఫ్టీ సంకేతాలు వ‌స్తున్నాయి. తిరిగి ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో విశాఖ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యంద‌క్కించుకున్న గ‌ణ‌బాబుకు ఈ ద‌ఫా.. గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది.

పార్టీలో యాక్టివ్‌గానే ఉంటున్నా.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నార‌నేది ఆయ‌న‌పై వ‌స్తున్న ప్ర‌ధాన విమ‌ర్శ‌. ఇలా చూసుకుంటే.. వైసీపీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు వైసీపీ, ఒక‌టి బీజేపీ.. ఒక‌టి మాత్రమే టీడీపీ ద‌క్కించుకునే ఛాన్స్ ఉంద‌ని ప్రాథ‌మికంగా విశ్లేష‌కులు భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: