కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీఎస్టీ ప‌రిధిలోకి పెట్రోల్, డీజీల్‌ను తీసుకురావాల‌ని డిమాండ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం కూడా దీని గురించి రాష్ట్రాల‌తో ఎప్ప‌టి నుంచో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఇలా చేయ‌డం వ‌ల్ల పెట్రోల్, డీజీల్ ధ‌ర‌ల్లో భారీగా మార్పు వ‌స్తుంద‌ని ప్ర‌జ‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల ల‌ఖ్‌న‌వులో జ‌రిగిన జీఎస్టీ మండ‌లి స‌మ‌వేశంలో ఈ విష‌యంలో ఏదో నిర్ణ‌యం తీసుకుంటార‌ని భావించారు. కానీ, జీఎస్టీలోకి పెంట్రో డీజీల్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తేవ‌డం కుద‌ర‌ద‌ని ప్ర‌క‌టించింది ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.

   
      ఒక‌వేళ పెట్రోల్, డీజీల్‌ను జీఎస్టీ కిందకు తెస్తే  అసలు ఎంత వరకు ధరలు తగ్గుతాయి, నష్టాలు ఏమైనా ఉన్నాయా ? వంటి విషయాల గురించి తెలుసుకుందాం.


    పెట్రోల్ బేస్ ధర రూ. 40 కి కొంచెం అటూ ఇటుగా ఉంటుంది. దీని మీద వ్యాట్, డీలర్ కమిషన్, ఎక్సైజ్ సుంకం లాంటి అనేక ఛార్జీలు క‌లిపి రూ.60 కి పైగా ఉంటుంది. ఈ పన్నుల్లో కొంత కేంద్రానికి, కొంత రాష్ట్రాలకు అందుతుంది. దీంతో కొనుగోలు ధర పెట్రోల్ బంకు వద్ద ప్రస్తుతం రూ.100 కు పైగా ఉంది. అలాగే డీజీల్ కూడా సెంచ‌రీకి ద‌గ్గ‌ర‌గా ఉంది. రాష్ట్రాల పన్నుల్లో వ్యత్యాసం ఉన్నందున పెట్రోల్‌, డీజీల్‌ ధరల్లో కూడా తేడా ఉంటూ వ‌స్తోంది.


    జీఎస్టీ లో అనేక శ్లాబులు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఒకవేళ గరిష్ఠ శ్లాబ్‌ అయినా 28 శాతం పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ని చేరిస్తే ధరలు ఎంత వరకు తగ్గుతాయ‌నేది అంచ‌నా వేస్తే. బేస్ ధర మీద 28 శాతం జీఎస్టీ ప‌న్ను వేసిన‌ట్ట‌యితే.. సుమారుగా రూ.11-12 , అలాగే దీనికి డీలర్ కమిషన్ రూ.3-4 క‌లిపితే.. దాదాపు రూ.55-56  వ‌ర‌కు పెట్రోల్‌, అలాగే రూ.50 వ‌ర‌కు డీజీల్ ధ‌ర‌లు త‌గ్గేంకు అవ‌కాశం ఉంటుంది.. ఈ లెక్క‌న ఇప్పుడు ఉన్న ధ‌ర‌ల‌తో పోలిస్తే దాదాపు పెట్రోల్‌, డీజీల్ పై స‌గానికి త‌గ్గుతుంద‌న్న మాట‌.
 

    అయితే, పెట్రోల్‌, డీజీల్ ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను  కేంద్రం ఒప్పించ‌డ‌మే అతి పెద్ద స‌వాల్‌గా మార‌నుంది. ఏడాదికి వేల కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. దీని వ‌ల్ల కొన్ని రాష్ట్రాలు దీనికి వ్య‌తిరేకంగా ఉన్నట్టు క‌నిపిస్తోంది. ప‌న్నుల ద్వారా ఏటా సుమారు రూ.5 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేస్తుంటుంది. ఇందులో రాష్ట్రాల వాటా సుమారుగా  రూ.2 ల‌క్ష‌ల కోట్లుగా ఉంటుంది. జీఎస్టీ ద్వారా కొంత రాష్ట్రాల‌కు తిరిగి వ‌చ్చినా ఇప్ప‌టి ప‌న్నుల‌తో పోలిస్తే అది చాలా తక్కువ‌గా ఉంటుంది.  జీఎస్టీ తీసుకురావ‌డం వ‌ల్ల అనేక వ‌స్తువుల, సేవ‌ల ధ‌ర‌లు తగ్గాయ‌ని తెలుస్తోంది. ఇదే విధంగా పెట్రోల్‌, డీజీల్ ని కూడా ఇందులో చేరిస్తే సుమారుగా 50 శాతం వ‌ర‌కు ధ‌ర‌లు త‌గ్గ‌వ‌చ్చ‌ని అంచ‌నా.

మరింత సమాచారం తెలుసుకోండి: