ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత కమిటీల నియామకాలు లొల్లికి దారి తీస్తున్నాయి. ఏకపక్షంగా కమిటీలు వేస్తూ, తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఎవరికి వారు అసంతృప్తితో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో ఇటీవల జరిగిన పార్టీ కమిటీ ఎన్నికల సమావేశంలో రసాభాస నిదర్శనంగా నిలుస్తోంది.

ఇదే తరహా పరిణామం మరొకటి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్ద అడిశర్లపల్లిలో మండల పార్టీ కమిటీ ఎన్నికల సమావేశానికి వెళ్లిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారంటూ మరో వర్గం వారు ఎమ్మెల్యేను నిలదీశారు. ఒక పదవిలో ఉన్న వారికి మరొక పదవి ఇవ్వడం ఏమిటనీ, మండల కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని వేయాలనీ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షునిగా మళ్లీ పాత అధ్యక్షుడు వల్లపురెడ్డి పేరు ఎమ్మెల్యే ప్రకటించడంతో ఒక్కసారిగా అసంతృప్తి నాయకులు స్టేజి పైకి దూసుకెళ్లారు. రెండు పదవులు అనుభవిస్తున్న నాయకులకు అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ను నిలదీశారు. దీంతో ఆయన కొంత అసహనానికి గురైయ్యారు. వెంటనే మండల అధ్యక్ష కమిటీ పేర్లను ప్రకటించి వెళ్లిపోయారు.

ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ప్రకటించిన మండల అధ్యక్ష కమిటీపై అసంతృప్తులు భగ్గుమన్నారు. వారితో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు అంగడి పేట టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో రాసిన స్క్రిప్టు చదివి వినిపించారు. లోకల్ లీడర్లు ఏకపక్షంగా ఎవరిని సంప్రదించకుండా వారికి ఇష్టమైన పేర్లు రాసుకుని ఎమ్మెల్యేతో చదివించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రకటించిన మండల కమిటీని వెంటనే రద్దు చేయాలనీ, మండలంలోని అన్ని సామాజికవర్గాలను పిలిచి వారి అభిప్రాయాల ప్రకారం మండల కమిటీని ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. లేదంటే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఇక యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డికి స్వపక్షంలోనే వ్యతిరేకత ఎదురైంది. ఫైళ్ల శేఖర్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామ టీఆర్ఎస్ నేతలు పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించారు. మొత్తంమీద, ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్‌ సంస్థాగత కమిటీల నియామకాలు గడిబిడికి దారితీస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: