తిరుమల తిరుపతి దేవస్థానంకు ఏర్పాటైన కొత్త పాలకమండలిలో సభ్యులతో సమానంగా ప్రత్యేక ఆహ్వానితులు కూడా దర్శనాలకు సిఫార్సులు చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సభ్యులు ఏయే ప్రివిలైజస్‌ను కలిగి ఉంటారో అవన్నీ ఆహ్వానితులకు కూడా ఉంటాయని స్పష్టం చేసింది. 80 మందితో కూడిన టీటీడీ కొత్త పాలకమండలిలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. అయితే ఇప్పటికే వీఐపీ బ్రేక్‌, రూ.300 సుపథం దర్శనాలతోపాటు సేవల టిక్కెట్లను బ్లాకులో అమ్ముకుంటున్నారనీ, పదవీ దుర్వినియోగానికి పాల్పడి అక్రమార్జనకు అలవాటు పడ్డారన్న ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. వీటి ప్రకారం చూస్తే ఒక సభ్యుడు, లేదంటే ఒక ప్రత్యేక ఆహ్వానితుడు.. తనకు కేటాయించిన వీఐపీ బ్రేక్‌ దర్శనం, రూ. 300 సుపథం దర్శనం టిక్కెట్లను బ్లాకులో విక్రయించుకుంటే.. ఏడాదికి రూ.6.50 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.13 కోట్లు వరకు అక్రమార్జన సమకూరుతుందని టీటీడీ వర్గాల్లోనే కొందరు లెక్కలు కట్టి మరీ చెబుతుండటం గమనార్హం.

తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల వారు చెబుతున్న లెక్కల ప్రకారం.. రోజుకు 20 వరకు ఉండే వీఐపీ బ్రేక్ దర్శనాల్లో.. ఒక్కో దాన్ని రూ.10 వేలుకు విక్రయిస్తారట. ఈ లెక్కన వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు మాత్రమే రోజుకు రూ.2 లక్షలు వరకు ఆదాయం వస్తుంది. శని, ఆదివారాల్లో రోజుకు 12 బ్రేక్ దర్శనాలు అంటే... రోజుకు రూ.1.50 లక్షలు. నెలలో శని, ఆదివారాలు ఎనిమిది వరకు ఉంటాయి. ఈ ఎనిమిది రోజుల్లో రోజుకు 12 బ్రేక్‌ దర్శనాలకు చొప్పున మొత్తం రూ.12 లక్షలు వరకు ఆదాయం ఉంటుంది. ఇక నెలలో నాలుగు గురువారాలు మినహాయిస్తే మిగతా 18 రోజులు ఉంటాయి. ఇందులో రోజుకు రూ.2 లక్షలు చొప్పున రూ.36 లక్షలు వీఐపీ బ్రేక్‌ దర్శనాల టిక్కెట్లను బ్లాకులో అమ్మడం ద్వారా వస్తుందట. అంటే శని, ఆది వారాల్లో బ్రేక్‌ దర్శనాలకు రూ. 12 లక్షలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు రూ. 36 లక్షలు. ఈ రెండింటిని కలిపితే నెలకు రూ. 48 లక్షలు వరకు సమకూరుతుందట. అంటే సంవత్సరానికి రూ.5.76 కోట్లు. దీన్ని రెండు సంవత్సరాలకు లెక్కిస్తే రూ. 11.52 కోట్లు వరకు లాభం వస్తుందన్న మాట.

ఇక రూ. 300 సుపథం దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లను బ్లాకులో అమ్ముకుంటే.. ఒక్కో సభ్యుడికి ఎంతో వస్తుందో కూడా టీటీడీ వర్గాలవారు లెక్క కట్టి మరీ చెబుతున్నారు. ఒక్కో సభ్యుడికి రోజుకు 20 వరకు సుపథం దర్శనాలకు అనుమతి ఉంటుంది. ఒక్కో సుపథం టిక్కెట్టును రూ. వెయ్యికి విక్రయిస్తారట. ఈ లెక్కన రోజుకు రూ. 20 వేలు, నెలకు రూ. 6 లక్షలు, ఏడాదికి రూ. 72 లక్షలు అవుతాయి. దీన్ని రెండు సంవత్సరాలకు లెక్కిస్తే రూ.1.44 కోట్లు వరకు లాభం చేకూరుతుందట.

టీటీడీ పాలక మండలిలోని ఆహ్వానితుడో, లేదా సభ్యుడో దర్శనం టిక్కెట్లను బ్లాకులో విక్రయిస్తే ఆయన ఏడాది ఆదాయం బ్రేక్ దర్శనాలు, సుపథంలో మాత్రమే సుమారు రూ.6.50 కోట్లు. రెండు సంవత్సరాల పాలకమండలి పదవీ కాలంలో రూ. 13 కోట్లు వరకు ఆదాయం సమకూరుతుందట. ఇక కొవిడ్ తగ్గి తిరిగి ఆర్జిత సేవలు మొదలై తనకు కేటాయించిన టిక్కెట్లను బ్లాకులో విక్రయిస్తే ఎంత తక్కువ అనుకున్నా... రెండు సంవత్సరాల్లో కనీసం రూ. 8 కోట్లు వస్తుందట. అంటే మొత్తం రూ. 21 కోట్లు ఆదాయం బ్లాక్ మార్కెటింగ్ వల్ల సమకూరుతుందని టీటీడీ వర్గాలవారు కొండపై కోడే కూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: