ఏపీలో జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు 1503/ఎస్ఇసిబిటిఎల్2021, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి అనుగుణంగా 8-4-2021న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు 13 జిల్లాల్లోని 660 మండలాల్లో జరగాల్సి వుండగా వివిధ కారణాల రీత్యా 8 మండలాల్లో జరగలేదు. కాగా వాటిలో 126 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ కారణంగా 11 మంది పోటీ చేసిన అభ్యర్ధులు చనిపోవడంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మిగిలిన 515 జెడ్పిటిసి స్థానాలకు గానూ 2,058 మంది అభ్యర్ధులు పోటీ చేశారు.


మొత్తం ఎంపిటిసి స్థానాలు 10,047 కాగా అందులో  2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.  వివిధ కారణాల రిత్యా  ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ  నిలిచిపోయింది. కాగా పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్ధులు మరణించారు. మిగిలిన 7,220  స్థానాలకు గానూ  18,782 మంది అభ్యర్ధులు  పోటీ చేశారు. రాష్ట్ర హైకోర్టు  ఉత్తర్వులకు అనుగుణంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-కె కింద  పంచాయతీ రాజ్ చట్టం- 1994, 200, 201 సెక్షన్ల ప్రకారం  రాష్ట్ర ఎన్నికల సంఘం  ఎన్నికల ఫలితాల తేదీని  ఖరారు చేసింది.  దీని ప్రకారం 19-9-2021న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

 
సెప్టెంబర్ 16, 2021న  ఏపీ  హైకోర్ట్  ఉత్తర్వులను  అనుసరించి  కోవిడ్-19 కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన  ప్రత్యేక రక్షణ  మార్గదర్శకాలను జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఫలితాల ప్రకటన సమయంలో జాగ్రత్తలు పాటించాలని  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది వెల్ల‌డించారు. ప్రతి  అభ్యర్ధి, కౌంటింగ్ ఏజెంట్లు ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్ లేదా ఆర్.టి. పి.సి.ఆర్ లేదా రెండు డోసుల వ్యాక్సిన్ ధృవీకరణ ఉంటేనే లెక్కింపు కేంద్రం లోపలకి అనుమతి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.  ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్ లేదా ఆర్.టి. పి.సి.ఆర్ లేదా రెండు డోసుల వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాన్ని  కౌంటింగ్ ముందు రోజే  సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ కు అందజేయాల్సి ఉంటుంది.


13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు నిమిత్తం 209 కేంద్రాలను ఏర్పాటు చేసి, రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచించిన కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ, తగిన రక్షణ ఏర్పాట్లను చేశామ‌ని గోపాల కృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా, సురక్షితంగా పూర్తీ చేయడానికి గాను 11,803 కౌంటింగ్ సూపర్వైజర్లు, 32,264  కౌంటింగ్ పర్శన్స్ ను నియమించి అవసరమైన శిక్షణను వారికి ఇచ్చిన‌ట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో  కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశామ‌న్నారు. 13 జిల్లాల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించ‌చడానికి కమిషనర్ కార్యాలయం నుంచి 13 మంది అధికారులను నియమించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లా పరిషత్  సిఇఓలకు వీరు అవసరమైన సహాయసహకారాలు అందిస్తారు అని వివ‌రించారు ఆయ‌న‌.  

        


మరింత సమాచారం తెలుసుకోండి:

ap