దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసువ‌చ్చే విష‌యంపై కేంద్రం విముఖ‌త వ్య‌క్తం చేసింది. పలు రాష్ట్రాలు అందుకు సిద్దంగా లేవ‌ని తెలిపింది. ఇంతకీ దీనిపై రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరమేమిటి? కేంద్రం ఎందుకు కాదంటోంది? పరిశీలిస్తే ఒకటే విషయం స్పష్టమవుతోందని నిపుణులు భావిస్తున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తాము భారీగా ఆదాయం కోల్పోవలసి వస్తుందన్న ఉద్దేశంతోనే కేంద్రం, రాష్ట్రాలు ఈ విష‌యంపై విముఖంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది.


      2017లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ముడి చమురు, సహజ వాయువు, పెట్రోలు, డీజిల్‌, విమాన ఇంధనమైన ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ను దీని పరిధిలోకి తీసుకురాలేదు.  ఈ పెట్రో ఉత్పత్తులపై పన్ను వసూళ్లు కేంద్ర రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండటమే దీనికి కారణ‌మ‌ని తెలుస్తోంది. అందుకే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా  భారత్‌లో వాటిని తగ్గించడానికి ప్రభుత్వాలు ముందుకు రావ‌డంల లేదు. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్రాలు వేర్వేరుగా ఎక్సైజు, వ్యాట్‌ రేట్లను విధిస్తున్న‌ట్టు తెలిసిందే.


  అయితే ఆ ధ‌ర‌ల మ‌ధ్య ఎలాంటి పొంత‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే దేశమంతటా ఒకే విధమైన పన్ను అమల్లోకి వచ్చి భారీగా ధరలు త‌గ్గే అవ‌కాశం ఉంది.  ఢిల్లీలో లీటరు పెట్రోలు మూల ధర, రవాణా చార్జీలతో కలిపి రూ. 41.10. దీనికి కేంద్ర ఎక్సైజు పన్ను, డీలర్‌ కమిషన్‌, రాష్ట్ర వ్యాట్‌ను కలుపుకొంటే మార్కెట్‌ ధర రూ. 101.19లు ఉంది. అదే పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువ‌స్తే లీటర్‌కు ఎక్సైజు, వ్యాట్‌ పన్నులు లేకుండా, మూలధరపై 28% జీఎస్టీ (అంటే రూ. 11.50), ఆపైన డీలర్‌ కమిషన్‌ రూ. 3.84 పైసలను కలుపుకుని మొత్తంగా మార్కెట్‌ ధర లీటరుకు కేవలం రూ. 56.44 గా ఉంటుంది.


 అంటే వినియోగదారునికి దాదాపు సగం ధర తగ్గిపోతుంది. ఇదే విధంగా విష‌యం చూస్తే ప్రస్తుతం దేశ రాజ‌ధాని ఢిల్లీలో రూ. 88.62లుగా ఉన్న డీజిల్‌ ధర రూ.55.41కి తగ్గిపోతుంది అన్న మాట‌. అన్ని రాష్ట్రాల్లో ఇదే రీతిలో పెట్రోలు, డీజిల్ రేట్లు త‌గ్గిపోయేందుకు అవ‌కాశం ఉంది. క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల  దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై ప్రజలు ఇంధనంపై చేసే వ్యయం తగ్గిపోయినా, కేంద్ర రాష్ట్రాలు అదే పనిగా పన్నులు పెంచివేస్తూ ఆదాయాన్ని పెంచుకునే ప‌నిలో ప‌డ్డాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాలకు పెట్రో పన్నుల ద్వారా ఏటా రూ. 5 లక్షల కోట్ల ఆదాయం వ‌స్తోంది. ఇందులో రాష్ట్రాల వాట రూ.2 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. ఇంత ఆదాయాన్ని కోల్పోయేందుకు రాష్ట్రాలు సిద్దంగా లేవ‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gst