ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వచ్చే వరద నీరు తగ్గుతోంది. నాగార్జునసాగర్ గేట్లు పూర్తిగా మూసివేశారు. ప్రకాశం బ్యారేజీకి శనివారం రాత్రి వరకు వరద కొనసాగింది. ఆ తర్వాత  తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ గేట్లు క్రమంగా మూసి వేయడం ప్రారంభించారు.ఇటీవల ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో కృష్ణానది ప్రాజెక్టులకు మళ్లీ వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేయడం ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ వరద నీరు రావడంతో రాష్ట్రంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తి కిందకు విడుదల చేసిన నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో వృథాగా కలిసిపోయింది. వరద ఉధృతి శనివారం ఉదయం వరకూ కొనసాగింది. శనివారం రాత్రికి వరద ఉధృతి తగ్గిపోయింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు మూసి వేశారు.

శ్రీశైలం డ్యాం నిండుకుండను తలపిస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతోంది. 86వేల 770 క్యూసెక్కుల వరద నీటిని  కిందకు విడుదల చేస్తున్నారు. ఇందులో 54వేల క్యూసెక్కుల వరద నీటిని  విద్యుదుత్పాదన ద్వారా విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 589 అడుగుల నీటి మట్టం ఉంది.  ప్రాజెక్టుకు 34వేల 680 క్యూసెక్కులు వరద నీరు చేరుతోంది. 51వేల క్యూసెక్కులను విద్యుదుత్పాదన ద్వారా విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం  45టీఎంసీలు . ప్రస్తుతం 32టీఎంసీల నీటి మట్టం ఉంది. పులిచింతల ప్రాజెక్టు కు 11వేల 921 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 23వేల క్యూసెక్కుల నీటిని  కిందకు విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ కి పైనుంచి వరద నీరు వచ్చింది.శనివారం ఉదయం దాదాపు  లక్షా 70వేల క్యూసెక్కుల వరద నీటిని ప్రకాశం బ్యారేజీ గేట్లు మొత్తం ఎత్తి కిందకు విడుదల చేశారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద నీరు 84వేల క్యూసెక్కులకు పడిపోయింది. 60వేల క్యూసెక్కులను దిగువకు  విడుదల చేస్తున్నారు. మరో 20వేల క్యూసెక్కులను కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా ..ప్రాజెక్ట్‌లకు శుక్రవారం  వరకు వరద నీటి ప్రవాహం ఉంది.  అయితే ఆ నీటి ప్రవాహం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: