వైసీపీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకే మ‌రోసారి ఏపీలో స‌ర్వే చేప‌ట్ట‌నున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే పీకేతో స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ చ‌ర్చ‌లు కూడా పూర్తి చేశార‌ని.. త్వ‌ర‌లోనే ఆయ‌న ఏపీలో తిష్ట‌వేసి.. వైసీపీ పాల‌నా వ్య‌వ‌హారాలు.. ప్ర‌జ‌ల‌కు అందుతున్న ల‌బ్ధి, సంక్షేమ ప‌థ‌కాలు.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాల‌పై ఆయ‌న టీం స‌మ‌గ్రంగా ప‌రిశీలించి.. స‌ర్వే నివేదిక‌ను ఆరు మాసాల్లోనే అందిస్తుంద‌ని.. సీనియ‌ర్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. అయితే.. పీకే స‌ర్వే ఇంకా ప్రారంభం కాకుండానే వైసీపీలో ఉత్కంఠ‌కు దారితీస్తోంది.

ఏం జ‌రుగుతుందో.. త‌మ గురించి..త‌మ నియోజ‌క‌వ‌ర్గం గురించి.. పీకే ఎలాంటి రిపోర్టు ఇస్తారో.. అని అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు హ‌డలిపోతున్నార‌ని తెలుస్తోంది. నిజానికి ఈ స‌ర్వే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు కేవ‌లం.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు.. ప్ర‌జ‌ల‌కు ఒన‌గూరు తున్న ల‌బ్ధి.. సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల అభిప్రాయం.. వారు ఏమ‌నుకుంటున్నారు..?  ప్ర‌తిప‌క్షాల‌కు ఉన్న ఎడ్జ్ ఎంత‌?  ఏ పార్టీ ఈరెండున్న‌రేళ్ల‌లో పుంజుకుంది?  ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు?  వైసీపీ మ‌ళ్లీ రికార్డు స్థాయిలో స్థానాలు కైవసం చేసుకుంటుందా? అనే కోణంలోనే జ‌రుగుతుంద‌ని స‌మాచారం. ఎక్క‌డా ఎమ్మెల్యేలు, ఎంపీల ప‌నితీరుపై జ‌గ‌న్ స‌ర్వే చేయించ‌ర‌ని కూడా కొంద‌రు అంటున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జాప్ర‌తినిధులు మాత్రం హ‌డ‌లి పోతున్నారు. ఏమో.. ఈ స‌ర్వే అటు తిరిగి ఇటు తిరిగి త‌మ పీక‌ల‌కు చుట్టుకుంటే.. ఏం జ‌రుగుతుందో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్లు ల‌భిస్తాయో లేదో.. అని నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు. వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో .. చాలా మంది వైసీపీ నాయ‌కులు సొంత వ్య‌వ‌హ‌రాల్లో మునిగితేలుతున్నార‌నేది వాస్త‌వం. లేక‌పోతే.. ఆధిప‌త్య పోరుతో స‌త‌మ‌త‌మ‌వుతు న్నార‌నేది స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో పీకే క‌నుక ఆయా అంశాల‌పై కూడా దృష్టి పెడితే.. నిజంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ల‌భించ‌నివారి సంఖ్య‌లో ప‌దుల్లోనే ఉంటుంద‌ని అంటున్నారు. దీంతో వైసీపీలో పీకే స‌ర్వే ఉత్కంఠ‌కు దారితీసింది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: