ఫైబర్‌ నెట్‌ పై బురద జల్లాలనే ప్రభుత్వ కుట్రలో భాగంగానే.. గౌరీ శంకర్‌ ను ఎండీగా నియమిస్తూ సంబంధిత నోట్‌ ఫైల్‌ పై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి స్వయంగా సంతకం చేశారు అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. అర్హత లేని వ్యక్తిని నియమించారంటూ ఆరోపణలు రావడంతో దిక్కుతోచక తొలగించారు అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత గౌరీ శంకర్‌ నకిలీ ధ్రువ పత్రాలపై ఎందుకు విచారణ చేయలేదు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీశారు. ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు.

మీకు కావాల్సిన వ్యక్తి కాబట్టే వదిలేశారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంలో గౌరీశంకర్‌ నకీలీ సర్టిఫికెట్లు పై  ప్రభుత్వం విచారణ జరపాలి అని చినరాజప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. 24 వేల కిలోమీటర్ల ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్‌ వేయాలంటే రూ.4 వేల కోట్ల మేర ఖర్చు అవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు . దీన్ని రూ.330 కోట్లకు తెదేపా ప్రభుత్వం పూర్తి చేయగలిగింది అని ఈ సందర్భంగా గుర్తు చేసారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూ.149కే అంతర్జాలం, ఫోన్‌, టీవీ వంటి సౌకర్యాల్ని అందించింది అని ఆయన ప్రస్తావించారు.

ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ కూడా అభినందించారు అని గుర్తు చేసుకున్నారు. అద్భుతమైన ప్రాజెక్టును కుట్రపన్ని నాశనం చేశారు అని చినరాజప్ప రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకపోతే సీఐడీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏ స్థాయికైనా తీసుకెళ్తాం అంటూ హెచ్చరించారు. కుట్రలో భాగస్వాములందరినీ బయటకు తెచ్చి శిక్షించాలి అని డిమాండ్ చేసారు. కాగా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఫైబర్ నెట్ విషయంలో చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఒక అధికారిని కూడా అదుపులోకి తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: