ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అధికార వైసీపీ జోరు ముందు టీడీపీ పూర్తిగా చేతులు ఎత్తేసిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అస‌లు ఏ జిల్లా చూసినా .. ఏ నియోజ‌క‌వ‌ర్గం చూసినా కూడా టీడీపీ క‌నీసం ప‌రువు కూడా కాపాడుకు నే ప‌రిస్థితి లేకుండా పోయింది. విచిత్రం ఏంటంటే టీడీపీలో మ‌హా మ‌హులు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం ఆ పార్టీకి డిపాజిట్లు ద‌క్క‌డం లేదు. ఎంత పోటీ చేయ‌కుండా చేతులు ఎత్తేసినా అస‌లు పార్టీ కేడ‌ర్ కూడా ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓట్లేయ‌లేద‌ని ఎన్నిక‌ల ట్రెండ్స్‌, వ‌స్తోన్న ఫ‌లితాలు చెపుతున్నాయి. అస‌లు మాచ‌ర్ల‌, పుంగ‌నూరు, సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన పులివెందుల‌లో అయితే టీడీపీకి ఒక్క సీటు కూడా లేదు స‌రిక‌దా.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ పూర్తిగా నూటికి నూరు శాతం విజ‌యాల‌తో క్లీన్ స్వీప్ చేసి ప‌డేసింది.

ఇందులో పుంగ‌నూరులో మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో విప్ పిన్మెల్లి రామ‌కృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్క‌డ నుంచి ఆయ‌న గ‌త నాలుగు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు. ఇక కృష్నా జిల్లాలో టీడీపీకి చెందిన కీల‌క‌నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మైల‌వ‌రంలో టీడీపీకి ఘోర అవ‌మానం ఎదురైంది. ఉమా ప‌రువు పోయింది.

నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క గ్రామం అయిన గొల్ల‌పూడిలో వైసీపీ జోరు ముందు టీడీపీ బేజారు అయ్యింది. ఈ గొల్ల‌పూడి గ్రామం నుంచే గ‌త ఎన్నిక‌ల్లో ఉమాకు ఏకంగా 3 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంలోనూ మైల‌వ‌రం నుంచి ఉమాపై వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ గెలిచినా కూడా గొల్ల‌పూడిలో ఉమాకే 3 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. అయితే ఇప్పుడు అదే గ్రామంలో వైసీపీ పూర్తిగా స్వీప్ చేసేసింది.  గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్‌సీ కైవసం చేసుకుంది. ఈ గ్రామం సీఎం జ‌గ‌న్ రూట్ కోఆర్డినేట‌ర్ అయిన త‌ల‌శిల ర‌ఘురాంకు స్వ‌గ్రామం కావ‌డం విశేషం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: