నాలుగంటే నాలుగు కోట్లు ఇవ్వండి ప‌దివేల ఎక‌రాల‌కు నీళ్లొస్తాయి అని శ్రీ‌కాకుళం జిల్లా రేగిడి మండ‌లం ప్ర‌జ‌లు వేడుకుంటున్నారు. (సాయ‌న్న కాలువ గురించి)  కానీ జ‌గ‌న్ ప‌ట్టించుకోరు. రెండంటే రెండు కిలోమీట‌ర్ల దూరం.. ఈ పాటి రోడ్డు మీరు వేయ‌లేరా అని పాల‌కుల‌ను నిల‌దీస్తున్నారు గార మండ‌లం, శ్రీ‌కూర్మం పంచాయ‌తీ వాసులు.. చిన్న చిన్న ప‌నులే చేయ‌లేని జ‌గ‌న్ భారీ ప్రాజెక్టులు ఎలా చేప‌డుతున్నార‌ని వాపోతున్నారు. అవి ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు అమ్మేసి, త‌ద్వారా ఆదాయాలు చూస్తున్నారా అని  ప్ర‌శ్నిస్తున్నారు. ఇవే కాదు ఆయ‌న ఏర్పాటుచేసిన కార్పొరేష‌న్ల కు కూడా క‌నీస స్థాయిలో నిధులు లేవు. ఇంకా చెప్పాలంటే కొంద‌రికి స‌కాలంలో జీతాలు కూడా లేవు. రాజ‌కీయ నిరుద్యోగ నిర్మూల‌న‌లో జ‌గ‌న్ టాప్ రేంజ్ లో ఉన్న ముఖ్య‌మంత్రి అని ఇప్ప‌టికే తేలిపోయింది క‌నుక ఇక‌పై ప‌దవుల‌పై ఆశ‌లు వ‌ద్ద‌ని కొంద‌రు బాహాటంగానే చెబుతున్నారు. చెప్పిస్తున్నారు కూడా!


ప‌ద‌వి వ‌ద్దండి..నేను పోయి నిధులిమ్మ‌న్నా ఆయ‌న ఇవ్వ‌రు..అయినా ఉమ్మ‌డి రాష్ట్రంలో నాకంటూ ఓ గొప్ప పేరు ఉంది. దానిని నేను చెడగొట్టుకోను అంటూ ఓ నేత ఇటీవ‌లే వ్యాఖ్యానించారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఆ నేత రాజ‌శేఖ‌ర్ రెడ్డి కి అత్యంత స‌న్నిహితు లు. అలానే ఆనాటి ప్ర‌భుత్వంలో ఆయ‌న‌ది రెండో స్థానం. అలాంటి నేతనే ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారంటే ఇక వైసీపీ ప్ర‌భుత్వం ప‌రిస్థితి ఎలా ఉందో ఏంటో అన్న‌ది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ క్ర‌మంలోనే అమాత్య ప‌ద‌వివి అల్లంత దూరంలో ఉండిపోవ‌డానికి ఆయ‌న ఇష్ట‌పడుతున్నారు. ఇదే కోవ‌లో మ‌రికొంద‌రు కూడా ఉన్నారు. అంతేకాదు స్థానిక సంస్థ‌ల‌కు నిధులు ఇవ్వ‌డంలో జ‌గ‌న్ అస్స‌లు ముందంజ‌లో లేరు అన్న‌ది వాస్త‌వం. క‌నీసం రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు సైతం ఆయ‌న నిధులు ఇవ్వ‌డం లేదు.


ఇప్పుడు కొత్త‌గా ప‌ద‌వులు అందుకుని జెడ్పీ పీఠాన్నో, ఎంపీపీ స్థానాన్నో సొంతం చేసుకుంటే వ‌చ్చే లాభం ఏమీ లేద‌ని కొంద‌రు నాయ‌కులు పెద‌వి విరుస్తున్నారు. జ‌గ‌న‌న్న త‌ర‌ఫున మాట్లాడే ధైర్యం కూడా గ్రామాల్లో తాము చేయ‌లేక‌పోతున్నామ‌ని కొంద‌రు ఎమ్మెల్యేలు బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఎంత‌సేపు సంక్షేమం పేరిట నిధులు అంటూ గ‌గ్గోలు పెట్ట‌డం మిన‌హా తాము చెప్పినవి, త‌మ ప్రాధాన్యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లో తీసుకుని ముఖ్య‌మంత్రి ఎదుట ఉంచిన‌వి ఏవీ ఆయ‌న ఒప్పుకోవ‌డం లేద‌ని కొంద‌రు నిర‌స‌న స్వ‌రం వినిపిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

ap