ఏడు సంవ‌త్స‌రాలుగా జ‌వ‌స‌త్వం లేని తెలంగాణ కాంగ్రెస్‌కు టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని నియ‌మించ‌డంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత నుంచి ఆ పార్టీ కార్య‌క‌లాపాలు చురుగ్గా సాగుతున్నాయి. గ‌తం నుంచే తెలంగాణ‌లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ అయిన త‌రువాత మ‌రింత దూకుడు పెంచారు. స‌మ‌యం దొరిక‌న‌ప్పుడ‌ల్లా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంతో పాటు సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సందిస్తూనే ఉన్నారు. సీనియ‌ర్ల‌ను క‌లుపుకుంటూ వెళ్తూ పార్టీ కోసం ప‌ని చేస్తున్నారు. అలాగే `ద‌ళిత‌, గిరిజ‌న‌, ఆదివాసీ ఆత్మ‌గౌర‌వ దండోరా పేరుతో స‌భ‌లు నిర్వ‌హిస్తున్నారు.



 ఇటీవ‌ల  కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్వ‌హించిన ద‌ళిత‌, గిరిజ‌న దండోరా సభ విజ‌య‌వంతం అయింది. దీంతో పాటు గ‌తంలో నిర్వ‌హించిన స‌భ‌ల‌కు భారీగా జ‌నాలు వ‌చ్చారు. దీంతో కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఆనందం వ్య‌క్తం అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ హ‌స్తం పార్టీ మ‌రో అడుగు ముందుకు వేస్తోంది. ఈ సారి నిరుద్యోగులు, యువ‌త కోసం పార్టీ పోరుసాగించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు నిరుద్యోగ స‌మ‌స్య‌పైన పోరు జ‌రిపి, టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ల్లు ర‌వి చెప్పారు. `నిరుద్యోగ ధ‌ర్మ యుద్ధం` పేరుతో స‌భ‌లు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం.

 
      ఈ స‌భ‌ను సీఎం కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల నుంచే ప్రారంభించ‌బోతున్న‌ట్టు కాంగ్రెస్ ప్రచార కమిటీ వైస్ చైర్మన్ అంజాతుల్లా తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగంపై యుద్దం చేసి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల్లో చైతన్యం నింపి అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా యుద్ధం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఈ పోరులో భాగంగా నిరుద్యోగులు, యువ‌కులు, యూనివ‌ర్సిటీ మేధావులు, ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఈ పోరులో భాగం కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: