తెలుగుదేశం పార్టీ ఏపీ రాజకీయాల్లో ఇపుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పాలి. రెండున్నరేళ్ల క్రితం భారీ పరాజయం తరువాత విజయం అన్న మాట ఆ పార్టీ ఎరగడంలేదు. నిజానికి ఒక ఓటమి నుంచి మరో విజయానికి ఎవరైనా బాటలు వేసుకుంటారు. కానీ టీడీపీ విషయానికి వస్తే పరాజయం నుంచి పరజయానికే అడుగులు పడుతున్నాయి.

 దానికి టీడీపీ అధినాయకత్వం వరసగా చేస్తున్న తప్పులు ఒక ఎత్తు అయితే వైసీపీ దూకుడు కూడా మరో వైపు ఆ పార్టీని మూలకు నెడుతోంది. లోకల్ బాడీ ఎన్నికల విషయంలో టీడీపీ అనుసరించిన అనేక వ్యూహాలు వైఖరుల కారణంగా జనాలకు ఏం అర్ధమైందో తెలియదు కానీ పార్టీ జనాలు మాత్రం డీ మోర్జలైజ్ అయ్యాయి. 2020 మార్చిలో ఎన్నికలను వైసీపీ సర్కార్ పెట్టాలని చూస్తే నాడు అడ్డుకోవడం టీడీపీ చేసిన పెద్ద తప్పు అయితే పరిషత్ ఎన్నికలను బహిష్కరించి మరో తప్పు చేసింది.

ఇక అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించే బదులు కోర్టులలో కేసులు వేయడం ద్వారా టీడీపీ పుణ్య కాలమంతా గడుపుతోంది. మరో వైపు చూస్తే 2019 ఎన్నికల తరువాత నుంచి విజయం అనే టానిక్ ని తాగుతూ బలోపేతమవుతున్న వైసీపీ ప్రతీ ఎన్నికలోనూ టీడీపీని ఓడిపోయే పార్టీగానే ముందే చూపిస్తూ ఆ పార్టీ  క్యాడర్ ని డీ మోరలైజ్ చేస్తూ వచ్చింది.  ఇక వరస ఎన్నికలు జరగడం  ఓడడం వల్ల కూడా టీడీపీ తమ్ముళ్లలో  ఆత్మ స్థైర్యం దెబ్బ తింది. ఇదిలా ఉంటే పరిషత్ ఎన్నికల ఫలితాలతోనే  కధ అయిపోవడంలేదు.

తొందరలోనే కడపజిల్లా బద్వేల్ కి ఉప ఎన్నిక ఉంది. ఆ ఎన్నిక కచ్చితంగా వైసీపీకి నల్లేరు మీద నడకే అవుతుంది. ఇక మరో వైపు చూస్తే ఈ ఊపుతో వైసీపీకి జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలు రప్పించేందుకు వైసీపీ పెద్దలు చూస్తే కనుక 2022లోనూ అపజయాలు టీడీపీని పలకరిస్తాయి. ఇలా తమ ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకత లేదు, రాబోదు అని చెప్పడానికి జగన్ మాస్టర్ ప్లాన్ కి తెర తీస్తూంటే టీడీపీ మాత్రం వ్యూహాత్మక తప్పిదాలతో ఇబ్బందులు పడుతోంది. దీని నుంచి ఎలా బయటపడాలో ఆ పార్టీ గట్టిగానే సమీక్షించుకోవాల్సి ఉంది. మొత్తానికి ఈ రోజుకు చూస్తే టీడీపీ సమాధానం చెప్పుకోవాల్సింది క్యాడర్ కే  ముందు అని అర్ధం చేసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: