ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు మొత్తం వ‌చ్చేశాయి. మొత్తం 13 జ‌డ్పీ చైర్మ‌న్లు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఇక 13 జిల్లాల‌కు జిల్లా పరిష‌త్ చైర్మ‌న్ల‌ను కూడా వైసీపీ ప్ర‌క‌టించింది. పార్టీ కోసం త్యాగాలు చేసిన నేత‌ల‌తో పాటు పార్టీ కోసం న‌మ్మిన బంట్లుగా ఉన్న వారు.. జ‌గ‌న్ కోసం క‌ష్ట‌ప‌డిన వారు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీట్లు వ‌దులుకున్న వారికే జ‌గ‌న్ జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.  ఈ మేరకు వైసీపీ అధిష్టానం జడ్పీ ఛైర్మన్ల పేర్లను ఎంపిక చేసింది. శ్రీకాకుళం జిల్ల పరిషత్ ఛైర్మన్ గా పిరియా విజయకు ఛాన్స్ ఇచ్చారు.

విజయనగరం జిల్లాకు మజ్జి శ్రీనివాసరావు ఖ‌రార‌య్యారు. ఆయ‌న మంత్రి బొత్స‌కు స్వ‌యానా మేన‌ళ్లుడు. ఇక  విశాఖపట్నంకు శివరత్నం, తూర్పు గోదావరి జిల్లాకు వేణుగోపాలరావు పేర్లు ఖ‌రారు అయ్యాయి. ఇక పశ్చిమగోదావరి జిల్లాకు కవురు శ్రీనివాసరావు పేరు ఖ‌రారు చేసింది. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో మంత్రి రంగ‌నాథ రాజు కోసం ఆచంట సీటు త్యాగం చేశారు. జ‌గ‌న్ చెప్పిన వెంట‌నే ఆయ‌న సీటు వ‌దులుకున్నారు. ఇక శ్రీనివాస్ ప్ర‌స్తుతం పాల‌కొల్లు వైసీపీ ఇన్‌చార్జ్ గా కూడా ఉన్నారు.

ఇక కృష్ణా జిల్లాకు ఉప్పాళ్ల హారిక, గుంటూరు జిల్లాలకు హెనీ క్రిస్టినా పేర్లు ఖ‌రారు అయ్యాయి. క్రిస్టినా 2014 ఎన్నిక‌ల్లో తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆమె డీసీఎంఎస్ చైర్మ‌న్ గా ప‌ని చేశారు. ఇక  ప్రకాశం జిల్ల పరిషత్ ఛైర్మన్ గా బూచేపల్లి వెంకాయమ్మ పేరు ఖ‌రారు అయ్యింది. ఆమె కుమారుడు బూచేప‌ల్లి శివ ప్ర‌సాద్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో ద‌ర్శి సీటు వ‌దులుకున్నారు.

ఇక నెల్లూరుకు ఆనం అరుణ, అనంతపురం జిల్లాకు గిరిజ పేర్లు ఖ‌రారు చేశారు. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి పేరు ఖ‌రారు చేసింది. ఆమ‌ర్ నాథ్ రెడ్డి గ‌తంలో రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి పార్టీ కోసం ప‌నిచేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు సీటు రాలేదు.  చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా శ్రీనివాసులు, కర్నూలు జిల్లాకు వెంకటసుబ్బారెడ్డిలను ఎంపిక చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: