నిరుద్యోగులకు గాలం వేసే యత్నం
వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా  చేసే వాగ్దానాలు  ఆయా వర్గాల ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఉత్తర భారతావని లో ఐదు రాష్ట్రాల కు  త్వరలో  సార్వత్రిక  ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో  ప్రతి రాజకీయ పార్టీ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలుపడుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలలో,  ఎన్నికల ప్రచారంలో హామీలను గుప్పిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) కూడా ఐదురాష్ట్రాల ఎన్నికల్లో తన అభ్యర్ధులను బరిలోదించ నుంది. ఉత్తర్ ఖండ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆప్ నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆ పార్టీ అధినాయకుడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ఆప్ అధినేత ఓటర్లకు వరాల జల్లు లు కురిపించారు. నిరుద్యోగం లేకుండా చేస్తామని చెప్పారు. ఉద్యోగం కల్పించే దాకా ప్రభుత్వం వారికి నెలకు ఐదు వేలరూపాయలు నిరుద్యోగ భృతి అందజేస్తుందని వాగ్దానం చేశారు. అంతే కాకుండా ప్రైవేటు కంపెనీల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించేలా చట్టం చేస్తామని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి తన ప్రతాపాన్ని చూపించిన వేళ చాలా మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. కరోనా గడ్డు పరిస్థితిని ఎదుర్కోనేందుకు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం జాబ్ పోర్టల్ ను రూపొందించిందని చెప్పారు. దాని ద్వారా పది లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అదే తరహా పోర్టల్ ను  ఉత్తర్ ఖండ్ లో కూడా ప్రవేశ పెడతామని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రజలు ఉచిత విద్యుత్ ను కోరుతున్నారని అన్నారు. అయితే ఈ విషయంపై తాను ఏ విధమైన ప్రకటన చేయలేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఒక అవగాహనకు వచ్చిన తరువాత ప్రకటన చేస్తానని చెప్పారు. ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వలని తమ పార్టీ భావిస్తున్నదని  అన్నారు. ముందుగా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండా మాట్లాడటం సబబు కాదని ఆప్ అదినేత వ్యాఖ్యానించారు.
  అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి  విమర్శించారు. తరుచుగా ముఖ్యమంత్రులను ఎందుకు మారుస్తోందని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బి.జె.పి ని గెలిపిస్తే ప్రతి నెలా ఒక కొత్త ముఖ్య మంత్రిని చూడాల్సి వస్తుంది, అదే  ఆప్ ను గెలిపిస్తే ఐదు సంవత్సరాల పాటు ఒకే ముఖ్యమంత్రి ఉంటాడు అని కేజ్రీవాల్  ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: