శ్రీ‌కాకుళం రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే స‌మున్న‌త శ్రేణీ రాజ‌కీయ నాయ‌కుల్లో ఎర్ర‌న్నాయుడు, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఉంటారు. ఎర్ర‌న్నాయుడు మ‌ర‌ణం త‌రువాత జిల్లా రాజ‌కీయాల‌కు పెద్ద దిక్కు ధ‌ర్మానే అయ్యారు. వీరిద్ద‌రూ ఒకే సామాజిక‌వ‌ర్గం అయిన‌ప్ప‌టికీ వేర్వేరు పార్టీల‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డంతో జిల్లా రాజ‌కీయాలలో వైరి పోరు విప‌రీతంగా ఉండేది. త‌రువాత ప‌రిణామాల్లో ఎర్ర‌న్న చ‌నిపోవ‌డంతో ధ‌ర్మాన రాజ‌కీయం నెగ్గుకు వ‌చ్చింది. ఆయ‌న అనుకున్న‌వి దాదాపుగా సాధించారు. ఆ క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డికి చేరువ అయ్యారు. ఆయ‌న హ‌యాంలో మున్సిప‌ల్ కౌన్సిల్ కూడా అప్ప‌ట్లో మంచి ప‌నులు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చేది. వివాదాలున్నా కూడా ధ‌ర్మాన మాట‌ల‌ను మాత్రం జ‌వ‌దాటేది కాదు. 




ప‌ద్మావ‌తి హ‌యాంలో న‌డిచిన మున్సిప‌ల్ కౌన్సిల్ ఆఖ‌రిది. త‌రువాత ఎన్నికలే జ‌ర‌గ‌లేదు. ఆమె సౌమ్యురాలు. వివాద ర‌హితంగా త‌న ప‌ని తాను చేసుకునిపోయేవారు. ఉపాధ్యాయ వ‌ర్గాల‌కు ఆమె ఎంతో చేరువ. ఉద్యోగుల‌ను గౌరవించే వారు. కొన్ని శ‌క్తుల ఆమెపై తిరుగుబాటు చేసేందుకు ప్ర‌య‌త్నించినా, ఆమె వాటిని తిప్పికొట్టారు. స‌మ‌ర్థ నాయ‌కురాలిగా ఇప్ప‌టికీ ఆ కుటుంబానికి మంచి పేరు ఉంది. ఇప్ప‌టికీ ఆ కుటుంబం ఎంద‌రికో సాయం చేస్తూనే ఉంది. రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రినీ గౌర‌వించే స్థాయి ప‌ద్మావ‌తిది. ఆమె త‌రువాత రాజ‌కీయాల్లో పెను మార్పు వ‌చ్చాయి. కౌన్సిల్ ఏర్పాటు కాక ప‌దేళ్లు దాటిపోయింది.




ఇలాంటి త‌రుణాన న‌గ‌ర కార్పొరేష‌న్ ప్ర‌తిపాద‌న తెర‌పైకి వ‌చ్చింది. పంచాయ‌తీల విలీనం అన్న‌ది కోర్టు వివాదాల్లో చిక్కుకుపోయింది. ధ‌ర్మాన‌కు మ‌ద్దతు ఇచ్చిన పంచాయ‌తీల‌లో పెద్ద‌పాడు, చాపురం ఉన్నాయి. ఖాజీపేట, కిల్లిపాలెం పంచాయ‌తీ తో స‌హా ఇంకొన్ని అభ్యంత‌రాల నేప‌థ్యంలో కోర్టుకు వెళ్లాయి. టీడీపీ మ‌నుషులంతా ఆ రోజు కోర్టును ఆశ్రయించ‌డంతో విలీనం ఆగిపోయింది. ఏడు పంచాయ‌తీల‌ను విలీనం చేయాల‌న్న ప్ర‌తిపాద‌న ఒక‌టి తెరపైకి తెచ్చి శివారు పంచాయ‌తీలను అభివృద్ధి చేయాల‌న్న ఆలోచ‌న‌తో ధ‌ర్మాన ముందుకువెళ్లారు. కానీ ఖాజీపేట త‌ర‌ఫున నాగావ‌ళి కృష్ణ, తోట‌పాలెం త‌ర‌ఫున జ‌గ‌దీశ్ అబ్బు ఇంకా ఇంకొంద‌రు గుండ ఇంటి మ‌నుషులు అడ్డు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవి, అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ‌కు చెందిన అనుచ‌రులు అర‌స‌వ‌ల్లి ప్ర‌భావిత ప్రాంతంలో ఉన్న నాయ‌కులు, సంబంధిత పంచాతీలు విలీనం వ‌ద్ద‌న్నాయి. దీంతో గుండ కుటుంబానికి, ధ‌ర్మాన కుటుంబానికి మ‌ధ్య  వైరం న‌డిచింది. ఎట్ట‌కేల‌కు ఏడు పంచాయ‌తీల విలీనంకు సంబంధించి ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ ఇవ్వ‌డం ఆస్తుల జ‌ప్తు కూడా చేసుకోవ‌డంతో త‌గాదా తీరింది. ఎన్నిక మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap