వైఎస్సార్ తెలుగు వారి నిలువెత్తు సంతకం. ఆయన రాజకీయం అంతా కూడా ధీరోదాత్తంగా సాగింది. ఆయనకు అలుపెరగని పోరాటయోధుడు అని పేరుంది. ఇక వైఎస్సార్ రాజకీయ వారసుడిగా జగన్ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఏపీలో ముఖ్యమంత్రి సీటుని ఆయన సాధించారు.

మరి ఆయనకు కుమార్తె కూడా ఉంది. షర్మిలకు కూడా రాజకీయల్లో వెలగాలని ఆశ ఉంది. అందుకే ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టారు. వైఎస్సార్ టీపీకి ఆమె ప్రెసిడెంట్.  ఇలా అన్నా చెల్లెళ్ళు రెండు పార్టీలతో రెండు రాష్ట్రాలలో  రాజకీయాన్ని నడుపుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది. వైఎస్సార్ బొమ్మను ఇద్దరూ వాడుకుంటున్నారు ఇందులో కూడా చింత ఎవరికీ లేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. అదేంటి అంటే వైఎస్సార్ ధర్మ పత్ని వైఎస్ విజయమ్మ విషయమే. ఆమెకు కొడుకు కూతురు ఇద్దరూ సమానమే.

దాంతో ఆమె ఇపుడు ఇరకాటంలో పడుతున్నారు. వైఎస్ విజయమ్మ కూడా రాజకీయలలో ఉన్నారనే అనుకోవాలి. ఆమె వైసీపీకి గౌరవ అధ్యక్షురాలు. ఆమె జగన్ తో పాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక ఆమె 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగానే కొనసాగుతున్నారు. అయితే ఇపుడు షర్మిల పార్టీ పెట్టడంతో విజయమ్మ ఆమె పక్కనే కనిపిస్తున్నారు. ఆమె ఆ పార్టీ సభలలో మాట్లాడుతున్నారు.

తాజాగా షర్మిల తన తల్లి తమ వైపే అంటూ చెప్పుకొచ్చారని టాక్. అంటే విజయమ్మ వైఎస్సార్ టీపీలో ఉన్నారా అన్నదే ఇక్కడ చర్చ. అలా అయితే ఆమె వైసీపీకి గౌరవ అధ్యక్షురాలు ఎలా అవుతారు. ఒకే వ్యక్తి రెండు పార్టీలలో ఎలా ఉంటారు అన్నది కూడా కీలకమైన ప్రశ్నగానే ఉంది. అయితే వైసీపీకి 2019 ఎన్నికలలో ప్రచారం చేసిన  విజయమ్మ ఆ తరువాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు. మరి తొందరలో వైసీపీ ప్లీనరీ ఉంటుదని అంటున్నారు. అపుడు కనుక విజయమ్మ కనిపించకపోతే ఆమె దూరం అయినట్లుగానే చూడాలి. ఏది ఏమైనా రెండు పార్టీలు, రెండు రాష్ట్రాలుగా వైఎస్సార్ ఫ్యామిలీ రాజకీయం చీలిపోయిన వేళ విజయమ్మకు అసలైన అగ్ని పరీక్ష ఎదురైంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp