కనీసం కూడు, గూడు,గుడ్డకు నోచుకోని దుర్భర స్థితిలో పేదలు జీవితాలను గడుపుతున్నారు . మరుగుదొడ్లు,పూరి గుడిసెల్లో నే కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవైపు రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు పరుగులు తీస్తుందంటున్న పాలకులకు పేదల దయనీయ స్థితి పట్టడం లేదు . ఒంటరి మహిళల పరిస్థితి మరీ దారుణం. ఇంటి పెద్ద లేక..పిల్లలు, కుటుంబ పోషణ భారం మోస్తున్న వారికి ఇల్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బాలానగర్ మండలం తిరుమలగిరి కి చెందిన గుమ్మడి సుజాత భర్త రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. వారికి భూమి ఏం లేదు ఇటీవలే వారి పాత ఇల్లు కూడా కూలిపోయింది.  దాంతో గతంలో సర్కారు నిర్మించిన మరుగుదొడ్డే వారికి ఆవాస మైంది.

తన ఇద్దరు కుమార్తెలు , అత్తతో కలిసి బాత్రూం లోనే కాలం వెళ్లదీస్తున్నారు  . వర్షం వస్తే రాత్రంతా జాగారమే. కుమార్తెలకు వివాహం కాలేదు. ఈడొచ్చిన అమ్మాయిలతో ఆరు బయట పడుకుంటే ఎప్పుడు ఏ ఆపద కలుగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు. అదే మండలం చొక్కంపేట గ్రామంలో బాలమ్మ,నవనీత ల పరిస్థితులు సైతం దుర్భరంగా ఉన్నాయి . వారి ఇల్లు కూడా ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా కూలిపోయింది. భర్త బాలయ్య మూడేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. ఇద్దరు కుమారులు వలసపోయారు. నవనీత వికలాంగురాలు. ఈమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త వెంకటయ్య వారిని వదిలేసి వెళ్లాడు. అప్పటినుంచి బాత్రూం లోనే బతుకులీడుస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 5500 బెడ్ రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 7533 ఇళ్లు మంజూరు అయ్యాయి. వనపర్తి జిల్లాలో 3840 ఇండ్లు మంజూరు కాగా,2017 లో పూర్తి చేశారు. గద్వాల జిల్లాలో  2525 ఇండ్లు మంజూరయ్యాయి. నారాయణపేటలో 520 ఇండ్లు మంజూరయ్యాయి. సమగ్ర సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలో నాలుగున్నర లక్షల మందికి సొంతిల్లు లేవని నివేదిక ఇచ్చారు. అందులో ఇప్పటి వరకు 19000 మాత్రమే పాలన అనుమతులు ఇచ్చారు. మిగతా వారికి సొంత ఇంటి నిర్మాణం కలగానే మారనుంది. ఇలా ఇండ్లు లేక చాలామంది గుడిసెలు, మరుగుదొడ్ల ల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: