కరోనా వైరస్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు. చిన్న దేశాలు మొదలు... అగ్రరాజ్యాల వరకు లాక్‌డౌన్ విధించాయి. బడా కార్పోరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని తేల్చి చెప్పేశాయి. ఇక సాఫ్ట్‌వేర్ సంస్థలైతే... గతేడాది మార్చి నెల నుంచి ఇప్పటి వరకు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేస్తోంది. కొవిడ్ సెకండ్ వేవ్ తగ్గడం, దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవడంతో... ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులకు చేరుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్ సంస్థలు సైతం తమ ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఓ వారం రోజుల క్రితమే... ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రో సంస్థ... తమ ఉద్యోగులను రోటేషన్ విధానంలో ఆఫీసుకు వచ్చేందుకు అనుమతించింది.

ప్రస్తుతం సంస్థలు ఉద్యోగుల భద్రత కోసం ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ... టెక్కీలు మాత్రం ఆఫీసుకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. ఎక్కువ శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే విషయాన్ని తమ తమ కంపెనీలు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో కూడా ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. ఇంటి దగ్గరే ఉండి పని చేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. కాదని కంపెనీలు బలవంత పెడితే... ఆ సంస్థను వదిలి... మరో ఉద్యోగంలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రైజ్ వాటర్ హైజ్ కూపర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కార్యాలయాల్లో కంటే కూడా... ఇంటి దగ్గర ఉండి పని చేయడమే తమకు సుఖంగా ఉందని దాదాపు 60 శాతం పైగా ఉద్యోగులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రస్తుతం సంస్థలు కూడా ఇదే బెటర్ అన్నట్లుగా భావిస్తున్నాయి. ఉద్యోగుల భద్రత అనేది ప్రస్తుతం చిన్న చిన్న సంస్థలతో పాటు కార్పొరేట్ సంస్థలకు కూడా కొంత భారమే. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ప్రతి ఉద్యోగికి రక్షణ కల్పించాలి. అందుకే దాదాపు ఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే సంస్థలన్నీ కూడా మొగ్గు చూపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: