టీడీపీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుని అసెంబ్లీ సమావేశాల్లో మైక్ ఇవ్వకపోవడం పట్ల ఆ పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నేడు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డికి, అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఒక లేఖ రాసారు. శాసన సభ లో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ప్రతిపక్షం ‎ బాధ్యత అని ఆయన లేఖలో తెలిపారు. ప్రజా సమస్యలకు పరిష్కారం కనుగొనే వేదికపై ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ ఉపపక్ష నేతలు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు, శ్రీ నిమ్మల రామానాయుడులకు మాట్లాడే అవకాశం లేకుండా చేయడమనేది సరైన విధానం కాదు అని విమర్శించారు.

సభ్యుల వివరణ  కూడా తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అని ఆయన లేఖలో విమర్శించారు. ప్రజాహితం కోరేవారైవనా ప్రజల తరఫన ప్రతిపక్షం నుంచి సూచనలు, సలహాలు కోరుకుంటారు అని అన్నారు ఆయన. కానీ ప్రతిపక్షం ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించడమే నేరంగా, ప్రజలపక్షాన మాట్లాడడం ఘోరంగా భావిస్తున్నారు అని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నేతలను శత్రువులుగా చూసే విధానం ఏమాత్రం సమర్థనీయం కాదు అని ఆయన తెలిపారు.

చట్ట సభల్లో మాట్లాడే అవకాశం లేకుండా చేయడమంటే రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్రం హక్కును నిర్వీర్యం చేయడమే అని విమర్శించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆ పార్టీ నేతలు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మర్చిపోయారా?  అని నిలదీశారు. మీరు స్పీకర్‌ పోడియం ఎక్కి ఆందోళనలు చేయలేదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయాలుగా చెప్పుకునే చట్టసభల్లో ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని, శాసనసభాపక్ష ఉప నేతలకు మాట్లాడే అవకాశం లేకుండా  తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించు కోవాలని కోరుతున్నాం అని లేఖలో ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ నిర్ణయం పై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: