వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీ నేతలకు హడల్. పైకి ప్రశాంతంగా కనిపించే జగన్... ఏదైనా తప్పు జరిగితే మాత్రం... చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతారని నేతలందరికీ తెలుసు. ప్రతికార్య చర్య కూడా చాలా తీవ్రంగా ఉంటుందని పార్టీ నేతల్లో టాక్. ఇక ప్రతిపక్షాలైతే.. ఆయన్ను నియంత హిట్లర్‌తో పోలుస్తారు. అలాంటి జగన్ చెప్పిన మాటను కూడా ప్రస్తుతం సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకు ప్రధాన కారణం... జగన్ చెబుతున్నారు కానీ ఆచరించడం లేదనేది నేతల భరోసా.

కలెక్టర్‌లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో నిన్న జరిగిన సమీక్షలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయంలో పనితీరుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు సచివాలయాలను అధికారులు నిత్యం సందర్శించాలని.. అధికారుల పనితీరును తనిఖీ చేయాలని కూడా సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి వారం రెండు సచివాలయాలు... ఇక జాయింట్ కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, ఐటీడీపీ ప్రాజెక్టు ఆఫీసర్లు కూడా వారంలో 4 సచివాలయాలు సందర్శించాలని ఆదేశించారు. వీరితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారంలో నాలుగు సచివాలయాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. ప్రతి ఒక్కరి దగ్గరి నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటామన్నారు. అలాగే వచ్చే డిసెంబర్ నుంచి స్వయంగా తానే సచివాలయాలు సందర్శిస్తా అంటూ హెచ్చరించారు కూడా. అయితే ప్రస్తుతం జగన్ హెచ్చరికలను నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకు ప్రధాన కారణం జగన్ గతంలో చెప్పిన మాటలే అంటున్నారు. సెప్టెంబర్ నెల నుంచి రచ్చబండకు ప్రతి జిల్లాకు వస్తానని చెప్పారు.... కానీ అది అమలు చేయలేదు. ఇక తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సమయంలో కూడా ప్రచారానికి వస్తానని చెప్పిన నేత... కరోనా కారణంగా రావడం లేదని ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. అందుకే జగన్ వస్తాడంటారు కానీ... రారనేది పార్టీ నేతల ధీమా.


మరింత సమాచారం తెలుసుకోండి: