ఏపీ అధికార పార్టీ వైసీపీ త‌మ‌ను ఇబ్బంది పెడుతోంద‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆరోపిస్తున్న విష యం తెలిసిందే. అంతేకాదు.. త‌మ‌వారిపై దాడులు చేస్తున్నార‌ని కూడా టీడీపీ నేత‌లు చెబుతున్నారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీకు సెగ‌లు పుడుతున్నాయి. అయితే.. ఇప్పుడు.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో.. అందునా.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సొంత జిల్లాలో.. మాత్రం.. టీడీపీ నుంచి వైసీపీకి సెగ‌లు పుడుతున్నాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క‌.. వైసీపీ నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రో రెండు రోజుల్లో అంటే.. ఈ నెల 26న మండ‌ల ప‌రిష‌త్‌ల‌లో ఎంపీపీ ఎన్నిక‌లు ఉన్నాయి.

అయితే.. ఈ జిల్లాలోని కొన్ని మండలాల్లో.. టీడీపీ దూకుడు చూపించింది. దీంతో వైసీపీకి సెగ‌లు పుడు తుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. కొన్ని మండలాల్లో హోరాహోరీగా ప్రతిపక్ష టీడీపీ పోటీ ఇచ్చింది. సగం సగం సీట్లు సాధించింది. దీంతో ఎవరు ఎవరిని మభ్యపెట్టి తమ పరం చేసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో క్యాంప్‌ రాజకీయాలు ప్రారంభ మయ్యాయి. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని రామభద్రపురం మండలంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. బాడంగి మండలంలో కూడా అధికార, ప్రతిపక్షాలు చెరి సగం స్థానాలు నిలబెట్టుకున్నాయి. సభ్యులను నిలబెట్టుకునేందుకు నాయకులు తంటాలు పడుతున్నారు. భోగాపురం మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది.

రామ‌భ‌ద్ర‌పురం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా... ఒక స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. మిగిలిన 13 ఎంపీటీసీ స్థానాల్లో 6 చోట్ల తెలుగుదేశం, ఒక స్థానంలో తెలుగుదేశం మద్దతుతో ఇండిపెండెంట్‌ విజయం సాధించారు. 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు, 2 చోట్ల వైసీపీ రెబల్‌ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఒక సభ్యుడు అటు, ఇటు అయితే ఫలితం తారుమారవుతుందన్న భయం నేతల్లో ఉంది. దీంతో  రెండు పార్టీలూ క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టాయి. గెలుపొందిన సభ్యులతో బేరసారాలకు తావులేకుండా మొబైల్‌ ఫోన్లు కూడా స్విచ్‌ ఆఫ్ చేయించారు.

తెలుగుదేశం పార్టీకి సంబంధించి సభ్యులను కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే మొదట బొబ్బిలి కోటకు తరలించారు. అక్కడి నుంచి అర్ధరాత్రి కారులో రహస్య శిబిరాలకు తీసుకెళ్లారు. ఎంపీపీ పీఠం అధికార పార్టీకి దక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికార పార్టీ కూడా ఆశలు వదులుకోకుండా ఒక్క సభ్యుడినైనా తమ వర్గంలోకి తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. వైస్‌ ఎంపీపీ పదవితోపాటు కొంత నగదు కూడా ఆ సభ్యుడికి ఇవ్వడానికి రాయబారాలు సాగిస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో రామభద్రపురం ఎంపీపీ పీఠం ఎవరు దక్కించుకుంటా రన్నదానిపై ఆస‌క్తి నెల‌కొంది.

ఇక‌, భోగాపురం మండలంలో టీడీపీ పుంజుకోవడంతో రాజకీయ పరిణామాలు వాడివేడిగా మారాయి. చాలా మండలాలల్లో ఎంపీపీ పీఠం ఏ పార్టీది అనేది ఓట్ల లెక్కింపురోజే ఓ అంచనా వచ్చేసింది.  ఈ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను  14 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. వీటిలో టీడీపీకి 7, వైసీపీకి 7 వచ్చాయి.  ఎంపీపీ పీఠం దక్కాలంటే 14 ఎంపీటీసీల్లో కనీసం 8 ఎంపీటీసీలు ఉండి తీరాలి.  వైసీపీకి టీడీపీ వారు లేదంటే టీడీపీకి వైసీపీ వారు ఒకరు మద్దతు తెలిపితే ఎంపీపీ పీఠం ఖరారవుతుంది. లేదంటే లాటరీ కీలకమవుతుంది. దీంతో ఇక్క‌డ కూడా వైసీపీకి టీడీపీ నుంచి బ‌ల‌మైన పోటీ ఎదుర‌వుతోంది. ఫ‌లితంగా.. అధికార పార్టీ నేత‌లు.. ఉక్కిరిబిక్కిరి గుర‌వుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: