వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి.. తీవ్ర సంక‌టంలో ప‌డ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడు చూపించినా.. కొన్ని చోట్ల మాత్రం టీడీపీ స‌భ్యులు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. దీంతో చాలా స్థానాల్లో ఎంపీపీ స్థానాల‌కు ట‌ఫ్ ఫైట్ ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఆళ్ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని దుగ్గిరాల మండల రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్షాలు రెండూ దుగ్గిరాల ఎంపీపీ పదవి తమ ఖాతాలోనే పడుతుందంటే కాదు... కాదు తమ ఖాతాలోనే పడుతుందని భరోసాతో ఉన్నాయి.

దుగ్గిరాల‌ మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో రెండు వైసీపీకి ఏకగ్రీవం అయ్యా యి. మిగిలిన 16 ఎంపీటీసీ స్థానాలకు రెండింటిలో జనసేన అభ్యర్థులను టీడీపీ బలపరిచి, మిగిలిన 14 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇందులో తొమ్మిదింటిలో ఘన విజయం సాధించి మండలంలో మెజారిటీ స్థానాలను గెలిచిన పార్టీగా టీడీపీ అవతరించింది. ఇక వైసీపీ ఆరు స్థానాల్లో గెలుపొంది ఏకగ్రీవమైన రెండింటితో కలుపుకొని ఎనిమిది స్థానాలను కైవశం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. జనసేన పోటీచేసిన రెండు స్థానాలలో ఒక్క స్థానంలో విజయం సాధించింది.

ఎన్నికలకు ముందే పొత్తులను కుదుర్చుకుని పోటీచేసిన దరిమిలా పది స్థానాలతో మెజారిటీగా ఉన్న టీడీపీ -జనసేన కూటమి ఎంపీపీ స్థానాన్ని కైవశం చేసుకునే అవకాశాలే ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  దుగ్గిరాల మండలాన్ని తమ పార్టీ కైవశం చేసుకోబోతుందంటూ ప్ర‌క‌టించారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.   ఇదిలావుంటే, దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడం కూడా  టెన్షన్‌ను క్రియేట్‌ చేస్తుంది. జనరల్‌ కేటగిరిలో వున్న చిలువూరు-1 స్థానం నుంచి విజయం సాధించిన బీసీ అభ్యర్థిని షేక్‌ జబీన్‌ను టీడీపీ తమ ఎంపీపీ అభ్యర్థిగా బరిలో నిలపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే ఆమెకు కులధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వకుండా ఎమ్మెల్యే ఆళ్ల దుగ్గిరాల తహసీల్దారుపై ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

ఇంకోవైపు వైసీపీ జనసేన తరఫున గెలిచిన ఈమని-1 విజేత పసుపులేటి సాయి చైతన్యను తమవైపు తిప్పుకొనేందుకు బేరసారాలు చేస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అధికార వైసీపీ ఎత్తుగడల నుంచి తమ కూటమి అభ్యర్థులను కాపాడుకునేందుకు టీడీపి కొందరు ఎంపీటిసి అభ్యర్ధులను రహస్య స్థావరాలకు తరలించింది. మొత్తంమీద దుగ్గిరాల ఎంపీపీ వ్యవహారం నియోజకవర్గంలో కాక రేపుతోంది. అయితే.. ఈ పోరులో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: