మ‌రో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జ‌డ్పీ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ విష‌యం.. అధికార పార్టీ వైసీపీకి తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. కొన్ని చోట్ల‌.. ఫ‌ర్వాలేద‌నుకున్నా.. మ‌రికొన్ని చోట్ల మా త్రం.. ఇది వైసీపీకి ఇబ్బందులు తెస్తోంది. చిత్తూరు జిల్లా జడ్పీ స్థానం ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక్క‌డ మంత్రి పెద్దిరెడ్డి హ‌వా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వైఎస్ కుటుంబానికి ఎక్క‌డో బీర‌కాయ పీచు సంబంధం ఉంద‌ని భావిస్తున్న శ్రీనివాసుల‌ను ఇక్క‌డ జ‌డ్పీ చైర్మ‌న్ పీఠంపై కూర్చోబెట్టాల‌ని మంత్రి గారు భావించారు.

ఈ క్ర‌మంలో ఆది నుంచి కూడా శ్రీనివాసులును ప్రోత్స‌హించారు. కానీ, చిత్తూరు జ‌డ్పీని బీసీ వ‌ర్గానికి కేటాయించారు. కానీ, శ్రీనివాసులు మాత్రం ఒక్క‌ళిగ వ‌ర్గానికి చెందిన వారు. దీన్ని మ‌న రాష్ట్రంలో ఓసీగా ప‌రిగ‌ణిస్తున్నారు. అయితే.. అప్ప‌టికే శ్రీనివాసుల‌ను ఇక్క‌డ జ‌డ్పీ పీఠం ఎక్కించాల‌ని స్కెచ్ వేసుకున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చి మ‌రీ.. ఈ రిజ‌ర్వేష‌న్ కేటగిరీని మార్చుకున్నారు. దీంతో ఈ సీటును ఓసీకి రిజ‌ర్వ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఫ‌లితంగా శ్రీనివాసులుకు లైన్ క్లియ‌ర్ అయింది. ఇక‌, ఆది నుంచి కూడా శ్రీనివాసులు.. పార్టీలోను, మంత్రి పెద్దిరెడ్డి ద‌గ్గ‌ర యాక్టివ్‌గా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు తిరుగులేకుండా పోయింది.

అయితే.. ఇక్క‌డ అసలు చిక్క‌ల్లా.. రిజ‌ర్వేష‌న్‌తోనే వ‌చ్చింది. శ్రీనివాసులు ఓసీ అయితే.. వైస్‌ ఛైర్మన్‌ పదవుల్లో ఒకటి బీసీలకు, మరోటి ఎస్సీలకు కేటాయించాల్సి వుంది. కానీ వైస్‌ ఛైర్మన్‌ పదవుల్లో మొదటిది చిత్తూరు డివిజన్‌లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ బలమైన జడ్పీటీసీకి, రెండో పదవి తిరుపతి డివిజన్‌లో ఎస్సీ మహిళా జడ్పీటీసీకి కేటాయించేలా జిల్లా ముఖ్యనేతలు ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. అంటే.. చైర్మ‌న్ ఓసీ, వైఎస్ చైర్మ‌న్‌ల‌లో ఒక‌రు ఓసీ.. అవుతారు. ఇదే ఇప్పుడు వైసీపికి ఇబ్బందిగా మారింది. బీసీ వ‌ర్గాల‌కు కేటాయించిన రిజ‌ర్వేష‌న్‌ను శ్రీనివాసులు కోసం మంత్రి మార్పించార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు త‌మ‌కు వైస్ చైర్మ‌న్ పోస్టు కూడా ఇవ్వ‌క‌పోతే.. ఎలా అనేది వీరి మాట‌.

ఇక చైౖర్మన్‌ అభ్యర్థి శ్రీనివాసులుది మదనపల్లె డివిజన్‌ కనుక వైస్‌ ఛైర్మన్‌ పదవులు చిత్తూరు డివిజన్‌కు ఒకటి, తిరుపతి డివిజన్‌కు ఒకటి  కేటాయించి ప్రాంతీయ సమతుల్యత పాటిస్తార‌ని స‌మాచారం. అయితే పార్టీలోని బీసీ వర్గాలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి.  బీసీల అవకాశాలను దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు  వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీకి చెందిన పలువురు బీసీ నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్ళేందుకు కూడా సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. జడ్పీ ఎన్నికలు జరిగే శనివారం లోపు ఈ పరిణామాలు ఎలా మారతాయో వేచిచూడాల్సి వుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: