తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకులు ఈ మధ్య కాలంలో బయటకు రావడం లేదు. అందులో మండలి మాజీ చైర్మన్ షరీఫ్ అయితే చాలా రోజుల నుంచి మీడియాలో కూడా కనపడటం లేదు. దీనితో ఆయన టీడీపీకి రాజీనామా చేసారనే వ్యాఖ్యలు వచ్చాయి. తాజాగా ఆయన స్పందిస్తూ కీలక కామెంట్స్ చేసారు. హైటెక్ సిటీ నిర్మాణం జరిగి 23 ఏళ్లు పూర్తవుతున్న శుభ సందర్భంలో దాని నిర్మాణం వెనకున్న చంద్రబాబు నాయుడి దూరదృష్టి, కృషిని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అని అన్నారు ఆయన.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు నాయుడు నాటిని  హైటెక్ సిటీ అనే విత్తనమే నేడు, తెలంగాణకు 60 శాతం ఆదాయాన్ని సమకూరుస్తోంది అని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మించడంతో ట్విన్ సిటీస్, ట్రైసిటీస్ గా మారిపోయాయి అని వివరించారు. అదే ఆలోచనతో, అదే అనుభవంతో చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి అంకురార్పణ చేశారు అని గుర్తు చేసారు. రైతులు రాష్ట్రం కోసం, చంద్రబాబు నాయుడి ఆలోచనలు గౌరవించి, 34 వేల ఎకరాల భూమినిచ్చారు అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఈ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి, యువతకు మద్యం, మాంసం దుకాణాల్లో ఉద్యోగాలిస్తోంది అని విమర్శించారు. ప్రభుత్వమంటే వ్యాపార సంస్థ కాదు అని అన్నారు. ప్రజల బాగోగులు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలి కానీ, లాభ నష్టాల గురించి కాదు అని షరీఫ్ హితవు పలికారు. హైటెక్ సిటీ నిర్మాణంతో తెలంగాణకు కలుగుతున్న  ప్రయోజనాలను గమనించి, రాష్ట్రయువత వచ్చేఎన్నికల్లో భవిష్యత్ ను, ఏపీ అభివృద్ధి దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు ఆయన. రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అయ్యాను అని తెలిపారు. టీడీపీ నాకు రాజకీయంగా గుర్తింపునిచ్చింది..పదవులను ఇచ్చింది అని అన్నారు. చంద్రబాబు నాకు రాజకీయ గురువు అని చంద్రబాబుకు సహాయ సహకారాలు అందించేందుకు రాజకీయంగా యాక్టివ్ అయ్యాను అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: