ముఖ్య‌మంత్రి సొంత జిల్లా క‌డ‌ప‌లో జ‌డ్పీ, ఎంపీపీ ప‌ద‌వుల సంద‌డి.. ర‌గ‌డ‌కు దారితీస్తోంది. మాకు కావాలం టే.. మాకు కావాలంటూ.. నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. అంతేకాదు.. ఈ పోరులో ఎమ్మెల్యేలు కూడా దూకుడుగా ఉండడంతో పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌ 5, మహిళలకు 4 కలిపి 10 స్థానాలు, బీసీ జనరల్‌ 6, మహిళలకు 6 కలిపి 12 స్థానాలు రిజర్వు చేశారు. అంటే.. 50 స్థానాలకు గానూ 22 జడ్పీటీసీ స్థానాలకు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వ్‌ చేశారు.

50 జడ్పీటీసీ స్థానాలకు గానూ ఏకగ్రీవాలతో కలిపి 49 స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకోవడంతో నాయ‌కుల సంఖ్య పెరిగి.. ప‌ద‌వులు ఆశించేవారి సంఖ్య ఇబ్బంది పెడుతోంది. రెండు వైస్‌ పీఠాలు ఉండడంతో ఒకటి నాన్‌ రెడ్డికి ఇచ్చి.. మరొకటి ఓసీలకే ఇస్తారా..? రెండు పదవులు ఎస్సీ, బీసీ, మైనార్టీల్లో ఒకరికి ఇస్తారా..? అన్న దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డికి చైర్మన్‌ పదవి ఖ‌రారైన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

దీంతో.. వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులపై ఏం చేస్తార‌నే చ‌ర్చ సాగుతోంది. కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఇద్దరికి వైస్‌ చైర్మన్‌ పదవులు ఇస్తారా..? రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి ఇస్తారా..? అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జడ్పీ వైస్‌ చైర్మన్‌ పీఠం లేదా కో-ఆప్షన్‌ మెంబరు ఏదో ఒకటి ఇవ్వాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే.. బద్వేలు ఉప ఎన్నిక దృష్ట్యా ఎస్సీ, బలహీనవర్గాల ఓట్లను ఆకట్టుకోవడానికి ఆ నియోజకవర్గంలో ఒకరికి వైస్‌ చైర్మన్‌ ఇవ్వవచ్చనే ప్రచారం జోరుగా ఉంది. అదే జరిగితే పోరుమామిళ్ల, బి.కోడూరు జడ్పీటీసీల్లో  ఒకరికి పీఠం దక్కే అవకాశం ఉంది.

అయితే.. ఇప్పుడు ఈ స‌మ‌స్య‌ను చ‌క్క‌దిద్దే బాధ్యత కీల‌క స‌ల‌హాదారు.. క‌డ‌ప‌కే చెందిన స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డికి అప్ప‌గించారు. దీంతో ఆయ‌న ఎవ‌రిని స‌ర్దు బాటు చేయాలో తెలియ‌క త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ని అం టున్నారు. మ‌రో రెండు రోజుల్లోనే ఎన్నిక ఉండ‌డం.. ఇప్పుడు ప‌దువులు ఆశించేవారు.. ఎక్కువ‌గా ఉండ డం వంటి ప‌రిణామాలు స‌జ్జ‌ల‌కు క‌త్తిమీద సాముగా మారాయ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: