ఏపీలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే జవాబు ఎవరికీ దొరకదు. జనం నాడిని పట్టడంలో ఎవరూ విజయం సాధించలేకపోతున్నారు. ఏపీలో జగన్ పని అయిపోయింది అన్న వారికి సమాధానం స్ట్రాంగ్ గానే వచ్చింది. లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు వైసీపీని తిరుగులేని ఆధిక్యంలో నిలబెట్టాయి.

దీని మీద ఎవరి వాదనలు వారికి ఉండొచ్చు. ఏపీలో పరిషత్ ఎన్నికలు జరిగి అయిదు నెలలు అయింది కాబట్టి ఈ ప్రజాభిప్రాయం పాతది అని కొట్టిపారేయవచ్చు. కానీ జగన్ అప్పటికే రెండేళ్ల పాలనను పూర్తి చేసారు. ఆ విధంగా అనుకుంటే రెండేళ్ళు దాటినా కూడా జగన్ క్రేజ్ తగ్గలేదుగా. ఇదే విషయం రాజకీయ పండితులు కూడా అంటున్నారు. మరో వైపు చూసుకుంటే రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా జగన్ పాపులారిటీ ఏమీ తగ్గలేదనే చెబుతున్నారు. అదే టైమ్ లో ఆయన అప్పు చేసి పప్పు కూడు పాలన మాత్రం తనకు అసలు నచ్చలేదని కుండబద్ధలు కొట్టారు.

ఇక వైసీపీ ధీమా కూడా అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో కోటీ ముప్పయి లక్షల మంది దాకా జనాలు ఓటేయగా అందులో  ఎనభై లక్షల దాకా వైసీపీకి ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓటింగ్ లో ఇది 67 శాతం పైగా ఉంది. మిగిలిన దాన్ని విపక్షాలు పంచుకున్నాయి. ఇందులో ప్రధాన  ప్రతిపక్షం టీడీపీకి 22 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే వైసీపీ లెక్క ప్రకారం 2019 నాటి ఎన్నికల కంటే తమకు 17 శాతం ఓటింగ్ పెరిగిందని, అదే విధంగా టీడీపీ ఓటింగ్ శాతం ఏకంగా 16 శాతానికి పైగా తగ్గిపోయిందని. మరి ఈ లెక్క కరెక్ట్ గా కొనసాగితే వైసీపీదే వచ్చే ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే  అని అంతా అంటారు.

అయితే ఈ లెక్కలను టీడీపీ అసలు ఒప్పుకోవడంలేదు. ఇదంతా గాలి పోగు చేసిన మాటలు అని అంటోంది. మరో వైపు చూసుకుంటే తమకు ఏపీలోని 13 జిల్లాలలో  బాగా బలం ఉందని అంటోంది. తాము పరిషత్ ఎన్నికలను బహిష్కరించాము కాబట్టే వైసీపీకి అంత మెజారిటీ వచ్చిందని కూడా అంటోంది. ఇప్పటికే ఏపీలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అని కూడా చెబుతోంది. ఎన్నికలు ఎపుడు జరిగినా వైసీపీకి భారీ ఓటమి ఖాయమ‌ని కూడా ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ లెక్కలు, ధీమాలు ఎలా ఉన్నా కూడా ఏపీ రాజకీయాలలో ఒక విషయం మాత్రం స్పష్టం. ఏపీ రాజకీయాల్లో ఎవరూ అసలు తగ్గడంలేదు. అది వైసీపీ అయినా టీడీపీ అయినా కూడా రేపటి రాజకీయ పోరాటం గట్టిగానే ఉంటుంది అన్నది మాత్రం స్పష్టమే.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp