రాజకీయాల్లో జనాలకు తమ బలమేంటో చూపించాలి. వారికి నమ్మకం కలిగించాలి. దాని కోసం నిరంతరం కసరత్తు చేస్తూనే ఉండాలి. ఒక సినిమా హిట్ అన్న టాక్ వస్తేనే జనాలు థియేటర్లకు వస్తారు. అలాగే ఒక పార్టీకి కూడా ఆదరణ ఉంది అని ప్రచారం అయితేనే ప్రజలు కూడా ఆ వైపు గా మొగ్గుతారు.

అయితే ఏపీలో చూసుకుంటే చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రెండున్నరేళ్ళుగా అధికారంలో కొనసాగుతున్నా కూడా వైసీపీకి జనాదరణ తగ్గడంలేదా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. దానికి సంకేతాలుగా లోకల్ బాడీ ఎన్నికలు ఎటూ ఉన్నాయి. మరో వైపు టీడీపీ నుంచి  వైసీపీలోకి వలసలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇది 2019 నుంచి మొదలైంది. ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. దీంతో వైసీపీయే ఏపీలో బలంగా ఉందా అన్న చర్చ అయితే జనంలో ఉంది.

తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు టీడీపీకి రాజీనామా చేయడం సంచలనమే అయింది. నిజానికి టీడీపీకి ఇపుడు గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఎంత హైప్ క్రియేట్ చేస్తున్నా కూడా పార్టీ గ్రాఫ్ అన్నది పెద్దగా పెరగడంలేదు. దానికి తోడు ఈ ఏడాది జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ దారుణమైన రిజల్ట్ నే పొందింది. ఇక తొందరలో కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో అదే ఫలితం రిపీట్ అవుతోంది అంటున్నారు. ఈ మధ్యలో పార్టీలో ఉన్న నాయకులు కూడా మెల్లగా జారుకుంటే పరిస్థితి ఏంటి అన్నదే చర్చ.

ఇక మంగళగిరి నుంచి రెండు సార్లు గెలిచి మంత్రిగా కూడా కాంగ్రెస్ టైమ్ లో చేసిన హనుమంతరావు టీడీపీని విమర్శిస్తూ  వైదొలగడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. అదే టైమ్ లో ఆయన జగన్ పాలనను పొగుడుతున్నారు. మరి ఇదే తీరున చాలా మంది టీడీపీ నేతలు ఉన్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. వైసీపీ కూడా ఇపుడు రాజకీయం రక్తి కట్టిస్తోంది. ఇదే తీరులో తొందరలో  మరింతమందిని తమ వైపునకు తిప్పుకునేందుకు వైసీపీ రెడీ అయితే టీడీపీకి అది మరింతగా ఇబ్బందికరంగా  మారుతుంది. ఎన్నికలు అయిన ఇన్నేళ్ళ తరువాత సహజంగా వైసీపీ నుంచి టీడీపీ వైపు వలసలు ఉండాలి. కానీ సీన్ చూస్తే రివర్స్ లో ఉంది. మరి దీని మీద టీడీపీ అధినాయకత్వం సర్దుకోకపోతే మాత్రం జనాల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్ళడం ఖాయం. అంతే కాదు క్యాడర్ కూడా డీ మోరలైజ్ అవుతుంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: