ఆఫ్ఘానిస్తాన్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత నెల 30వ తేదీ వరకు తాలిబన్ల అరాచకాలకు భయపడి దేశం విడిచి పారిపోయేందుకే ప్రజలు మొగ్గు చూపారు. అయితే ప్రస్తుతం దేశా సరిహద్దులు మూసివేయడం... తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో... ప్రజలు కూడా సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన తాలిబన్లు... ఇతర దేశాల మద్దతు కోరుకుంటున్నారు. అయితే ఇప్పట్లో పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం లేకపోవడంతో... అక్రమార్జన వైపు దృష్టి పెట్టింది ఆఫ్ఘాన్ ప్రభుత్వం. తాజాగా గుజరాత్‌లోని ముంద్రా పోర్డుకు వచ్చిన భారీ హెరాయిన్ డంప్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. ఈ హెరాయిన్ ఏపీలోని విజయవాడలో ఉన్న ఓ ఏజెన్సీ పేరుతో వచ్చింది. టాల్కమ్ పౌండర్ పేరుతో హెరాయిన్ రావడం వెనుక... రాజకీయ నేతల హస్తం ఉందని... ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది.

కానీ తీగ లాగితే డొంక కదిలినట్లుగా... ఈ భారీ హెరాయిన్ డంప్ ఆఫ్ఘాన్ నుంచి వచ్చినట్లు‌ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం భారత్‌లోకి మాత్రం ఆఫ్ఘాన్ నుంచే హెరాయిన్ అక్రమ రవాణా పెరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి హెరాయిన్ అక్రమ రవాణ చేస్తున్న తాలిబన్లు... ప్రస్తుతం భూ, సముద్ర మార్గాల ద్వారా ఇతర దేశాలకు మాదక ద్రవ్యాలు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో మత్తు పదార్ధాల వినియోగం భారీగా పెరిగింది. దీంతో హెరాయిన్‌ను అక్రమంగా స్మగ్లింగ్ చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. గుజరాత్‌లోని ముద్రా పోర్టులో లభించిన హెరాయిన్‌పైనే యాంటీ డ్రగ్, యాంటీ టెర్రరిస్ట్ ఏజెన్సీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ ఎలా వచ్చింది... ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయాలను కూపీ లాగుతున్నాయి ఏజెన్సీలు. పాకిస్తాన్ మీదుగా సముద్ర మార్గంలో ఈ హెరాయిన్ కంటైనర్లలో వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఆఫ్ఘాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఇరాన్ చేరుకుని... అక్కడి నుంచి వయా పాకిస్తాన్ భారత్‌లోని ముద్రా పోర్టుకు సరుకు చేరినట్లు భావిస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో భారత్‌లో సరుకు ఎవరు తెప్పించారనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: