తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ అంటే టక్కున గుర్తొచ్చేది చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, నాగబాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌లు అంటే అతిశయోక్తి కాదు. ఇటు సినిమాల్లోనే కాకుండా అటు రాజకీయంగా సైతం పట్టు నిలుపుకునేందుకు మెగా ఫ్యామిలీ ప్రయత్నిస్తోంది. కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రిగా చేసిన చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు చాలా తక్కువగా.... సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన సోదరుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీపై మెగాస్టార్‌ చిరంజీవి ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు. ఇక మెగా బ్రదర్‌ నాగబాబు అయితే.. పవన్‌ కల్యాణ్‌ పార్టీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున పోటీ కూడా చేశారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో జనసేన పార్టీ మైత్రి బంధాన్ని కొనసాగిస్తోంది. కాగా ఇటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో అంత క్లోజ్‌గా కనిపించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ-జనసేన అడుగులు వేస్తున్నాయి. ఆ ఎన్నికల్లో తమ కూటమి బలంగా ఉంటుందన్న ధీమా జనసైనికుల్లో కంటే.. కమలనాథుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక జనసేనతో తెలుగుదేశం పార్టీ కూడా 2014 నాటి పొత్తును పునరావృతం చేయాలని ప్రయత్నిస్తోంది.

ఇదిలావుంటే, పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ పవర్‌ ఏమిటో చూపాలని.. బాబాయ్‌కి అబ్బాయ్ జత అవుతున్నాడు. చిరంజీవి కుమారుడు, సినీ హీరో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ రంగంలోకి దిగుతున్నట్లు టాక్. బాబాయ్‌ పవన్‌కు అండగా నిలిచేందుకు రామ్‌చరణ్‌ పక్కా ప్లాన్‌లు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అది కూడా పల్నాడులో జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక పల్నాడుపైనే రామ్‌చరణ్‌ ఎందుకు ఫోకస్‌ పెట్టారనే విషయానికి వస్తే- కొన్ని రోజుల కిందట పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి సపోర్టు ఉందని జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ చేసిన కామెంట్లు.. రాజకీయంగా అనూహ్యంగా మారింది. ఇటీవల చిరంజీవి పుట్టినరోజున తన ఇంటికొచ్చిన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను అన్న చిరంజీవి గుండెలకు హత్తుకుని మరీ ఆహ్వనం పలికాడు. అంతేకాకుండా ప్రేమతో ముద్దు పెట్టాడు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో.. తన తమ్ముడు ఆశయం నెరవేరాలని చిరంజీవి ఆకాంక్షించారు. తన తండ్రి అంతరంగాన్ని తెలుసుకున్న రామ్‌చరణ్‌.. తన బాబాయ్‌ గెలుపు కోసం ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై నాదెండ్ల మనోహర్‌ను సంప్రదించారని సమాచారం. ఈ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన చర్చలో భాగంగానే... పల్నాడులో పట్టు కోసం స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. మరి బాబాయ్ పవన్‌ కోసం అబ్బాయ్‌ రామ్‌చరణ్‌ వేసే అడుగులు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: