ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో అదానీ పేరు బాగా వినపడుతోంది. ఎక్కడ చూసిన ఆయన పేరే హల్చల్ చేస్తుంది. ఎక్కడకక్కడ ప్రభుత్వ రంగానికి చెందిన ఆస్తులని అదానీ కొనుగోలు చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులని అదానీ గ్రూప్‌కు కట్టబెట్టేందుకు జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ పేరుతో ఏకంగా 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకై అదానీకి అవకాశం ఇస్తూ ఏపీ క్యాబినెట్ హడావిడిగా తీర్మానాలు చేయడంపై కూడా అనుమానాలు వస్తున్నాయి.

అసలు ఆంధ్రప్రదేశ్‌ని అదానీ ప్రదేశ్‌గా మార్చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జగన్ సర్కార్ అదానీతో లాలూచీ పడిందని, అందుకే ఏపీలోని పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ సంస్థలు వరుసపెట్టి అదానీ గ్రూపుకు అప్పగిస్తున్నారని అంటున్నాయి.

అయితే కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నం అయిన బందరు పోర్టుని సైతం అదానీ గ్రూపుకే కట్టబెట్టేందుకే జగన్ ప్రభుత్వం సిద్ధమవుతుందని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే బందరు పోర్టుకు టెండర్లు పిలిచినా సరే, వాటికి సరైన స్పందన రావడం లేదు. పోర్టుల నిర్మాణం-నిర్వహణలో అనుభవమున్న ఇన్‌ఫ్రా కంపెనీలూ బందరు టెండర్లవైపు కన్నెత్తి కూడా చూడటంలేదని తెలిసింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. వాటాల పేరుతో బడా బాబులు ఆడుతున్న ఆటే దీనికి కారణమని విమర్శలు వస్తున్నాయి. బందరు పోర్టులో 50 శాతం వాటాను దక్కించుకునేందుకు జగన్ ప్రభుత్వంలోని పెద్దల సాయంతో అదానీ ప్రయత్నిస్తున్నట్లు కథనాలు వచ్చాయి.

సగం వాటా ఏమో అదానీ గ్రూపుకు ఇచ్చి, మిగిలిన సగం వారు సూచించే రెండు కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అందుకే ఈ పోర్టు టెండర్ల జోలికి వేరే సంస్థలు జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది. అంటే బందరు పోర్టు కూడా అదానీ సంస్థకే వెళ్లనుందా? అని డౌట్ వస్తుంది. మొత్తానికి ఏపీలో అదానీ రాజకీయాలు ఎక్కువయ్యాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: