గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం తక్కువ.  ఖర్చులు ఎక్కువగా ఉండడంతో అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతోంది. జీహెచ్ఎంసీకి ప్రతి ఏటా సుమారు 2500 కోట్ల లోపే ఆదాయం ఉంటుంది. ఖర్చులు మాత్రం  రూ.3500 కోట్లకు పైగానే ఉంటున్నాయి. దీంతో వెయ్యి కోట్ల అప్పులు పేరుకుపోతున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులకు సైతం జీహెచ్ఎంసీ నిధులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను, టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చే భవన నిర్మాణ అనుమతులు, ఇతర ఫీజులు ప్రధాన ఆదాయ వనరులు.

కరోణ, లాక్ డౌన్ కారణంగా నిర్మాణ రంగం కుదేలవడంతో టౌన్ ప్లానింగ్ ఆదాయం తగ్గిపోయింది. ఆస్తిపన్ను వసూలు చేయాల్సిన బిల్ కలెక్టర్లు, టాక్స్  ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు ధరణి, వరద సాయం పంపిణీ, జిహెచ్ఎంసి ఎన్నికలు, రేషన్ కార్డుల పంపిణీ, కరోనా రోగులను గుర్తించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటి కార్యక్రమాలను అప్పగించడంతో  ఆస్తి పన్ను వసూలు కావడం లేదు. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. గతంలో ఫిక్స్ డిపాజిట్ లతో కళకళలాడిన జిహెచ్ఎంసి ఖజానా.. ఇప్పుడు ఖాళీ కావడంతో  అప్పుల ఊబిలో చిక్కుకుంది. ప్రస్తుతం ఖజానాలో ప్రభుత్వం ఇచ్చిన రూ.39 కోట్లు మాత్రమే ఉన్నాయి. నెలాఖరుకు ఆస్తిపన్ను, టౌన్  ప్లానింగ్ ద్వారా రూ.40-50 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. కానీ  రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు ఇవ్వాలంటే రూ.110 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా జిహెచ్ఎంసి నిర్వహించే పనులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అంచనాతో ఎన్ఆర్ డిపీ, రూ.1839 కోట్లతో సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం రూ.1500 కోట్లతో లింక్ రోడ్ల నిర్మాణ పనులు చేయాలని నిర్ణయించింది.

వీటికి అయ్యే నిధులను మాత్రం సర్కారు ఇవ్వకపోగా అప్పులు తీసుకుని పనులు చేయాలని  బల్దియాకు ఉచిత సలహా ఇచ్చింది. అందులో భాగంగానే బాండ్ల ద్వారా రూ.495 కోట్లు, రూపీ టర్మ్ లోన్  ద్వారా రూ.2,500 కోట్లు, సిఆర్ఎంపీ  కోసం రూ.1,460 కోట్లను బ్యాంకు లోన్ ద్వారా సేకరించారు. దీంతోపాటు మధ్యలో ఆగిపోయిన  జేఎస్ఎన్ యూర్ఎం ఇండ్లను పూర్తిచేయడానికి మరో రూ.337 కోట్లు బ్యాంకు రుణం తీసుకున్నారు. అప్పులు భారీగా పెరిగిపోయాయి. బల్దియా క్రెడిట్ రేటింగ్  దిగజారిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: