తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మారెడ్డి.  మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల నుంచి 2004 ఎన్నికల్లో ఈయన టీఆర్‌ఎస్‌ తరపున పోటీచేసి గెలుపొందారు. అంతకుముందే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ద్వారా రాజకీయంగా కొంత ఎదిగిన లక్ష్మారెడ్డికి తెలంగాణ ఉద్యమం, కేసీఆర్‌ సహచర్యం బాగా కలిసి వచ్చింది. పాలమూరు ప్రాంతంలో ఉద్యమాన్ని ఉరకలు ఎత్తించడంలో నిరంజన్‌రెడ్డితోపాటు లక్ష్మారెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా.. తన తొలి ప్రభుత్వంలో లక్షామారెడ్డికి మంత్రిగా అవకాశం కల్పించారు. అయితే మలి ప్రభుత్వంలో మాత్రం మహబూబ్‌నగర్‌ నుంచి లక్ష్మారెడ్డికి కాకుండా మంత్రిగా శ్రీనివాస్‌గౌడ్‌ను కేసీఆర్‌ ఎంచుకున్నారు. అయినా కూడా ఏనాడూ లక్ష్మారెడ్డి.. ఎలాంటి అసంతృప్తిని వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికే పరిమితమై జరుగుతున్న అభివృద్ధిలో పాల్పంచుకునేవారు. కానీ ఉన్నట్లుండి జరిగిందేంటో తెలియదు కానీ.. ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షే పథకాలపై జరుగుతున్న రాజకీయ నాయకుల విమర్షలపై, సమకాలీన రాజకీయాలపై లక్ష్మారెడ్డి తరుచూ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.  సంక్షేమ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను కూడా సూటిగానే విమర్షిస్తున్నారు లక్ష్మారెడ్డి. అలాగని ప్రతి అంశాన్ని కూడా ఎక్కడంటే అక్కడ విమర్శించడం లేదు. పలు పథకాలపై తన అభిప్రాయాన్ని చెబుతూనే.. ఇలాంటి అంశాలపై మేధావుల్లో చర్చ జరగాలని చెప్పి వదిలేస్తున్నారు.

లక్ష్మారెడ్డి వ్యాఖ్యల్లో చాలా నిగూఢ అర్థం ఉందని రాజకీయ వర్గాల వారు, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరుకున పెట్టేవిధంగా కూడా లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జనాలకు సంక్షేమ పథకాలు ఎక్కువయ్యాయనీ, సీఎంతో చెప్పి ఇప్పటికిపుడు ఇలాంటి పథకాలను అన్నింటినీ ఆపేయిం చాలని, ఎన్నికలు ఆరు నెలలు ఉండగానే మళ్లీ చేపట్టేలా చేయమని అడగాలని అనిపిస్తుందని కూడా లక్ష్మారెడ్డి అన్నారు. మొన్నటి మునిపిపల్ ఎన్నికల్లో.. ఒకవేళ మీరు కనుక టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే.. మీకు రేషన్ ఇవ్వము..ఇళ్లు కూడా ఇవ్వమని అన్నారు.ఇలా అంతటి సీనియర్ నాయకుడు వ్యాఖ్యానిస్తున్నారంటే..తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లక్ష్మారెడ్డి ఎందుకలా వ్యాఖ్యానిస్తున్నారో అని కూడా చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లు కొనసాగిన రాజకీయం.. రానురాను తనలాంటి వారికి స్థానం లేకుండా పోతుందా అని ఏదైనా అనుమానిస్తున్నారా? లేక ఇప్పుడు తప్పుకోవాలన్న ఉద్దేశ్యం ఏదైనా ఉందా? అని కూడా అనుకుంటున్నారు. ఇంతటి వ్యాఖ్యలు బహిరంగంగానే చేస్తున్నారంటే.. మరి సీఎం కేసీఆర్‌కు కూడా తెలిసే చేస్తున్నారా? ఇలాంటి చర్చ జరిగి సమాజంలో రాజకీయాలలో సమూల మార్పులు జరగాలనే భావనలో ఉన్నారా? అనేది కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: