ఎంపీటీసీ ఎన్నిక‌ల త‌ర్వాత ఫ‌లితాల వెల్ల‌డి ఆల‌స్యం అయింది. ఏద‌యితేనేం ఇదే మంచిది అని అనుకున్నారు కొంద‌రు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. ఇంత‌కాలం నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్నా రాజకీయం కాస్త బుస‌లు కొడుతోంది. పాత క‌క్ష‌లూ, గొడ‌వ‌లూ నేప‌థ్యంలో గ్రామాల్లో ర‌క్త‌పాతం సృష్టిస్తారు కొంద‌రు. పోలీసులు కూడా అధికార ప‌క్షం వైపు  ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.



కొన్ని, కొన్ని ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి క‌నీసం ఎఫ్ ఐ ఆర్ కూడా న‌మోదు చేయ‌డంలో విఫ‌లం అవుతున్నా ర‌ని బాధిత‌వ‌ర్గాలు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. నిన్న‌టి వేళ జ‌రిగిన శృంగ‌వ‌ర‌పు కోట ఘట‌న కానీ ఇప్ప‌టి ఆరిక‌తోట‌లో జ‌రిగిన ఘ‌ట‌న కానీ పాత వ‌ర్గ విభేదాల‌కు కొత్త‌గా ఆజ్యం పోసిన‌వే.




విజ‌య‌న‌గ‌రంలో స్థానిక పోరు ముగిశాక కూడా కొట్లాట‌లూ, రాళ్లు రువ్వుకోవ‌డాలూ జ‌రుగుతూనే ఉన్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం హ యాంలో ఎలాంటి చెడ్డ పేరూ రాకుండా న‌డుచుకోవాల్సిన కార్య‌క‌ర్త‌లు తరుచూ క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పుతున్నారు. అంత‌ర్గ‌త ఘ‌ర్ష‌ణ‌లు కార‌ణంగా బాహాబాహీ యుద్ధాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. పార్టీ నియ‌మాల‌నూ, నిబంధ‌న‌ల‌నూ దాటి, అతిక్ర‌మించి ప్ర‌వర్తిస్తున్నారు. దీంతో ప్ర‌శాంత‌త‌కు చిరునామా నిలిచే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ర‌క్త‌పాతంతో కూడిన రాజ‌కీయాలే రాజ్య‌మేలుతున్నాయి. ముఖ్యంగా ఆధిప‌త్య పోరుకు ద‌గ్గ‌ర‌గా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి అన్న విమర్శ‌లూ ఉన్నాయి. తాజాగా ఆరిక‌తోట (రామచంద్రాపురం మండ‌లం) వైసీపీ కార్య‌క‌ర్త‌లు వ‌ర్గ విభేదాల‌లో భాగంగా ఒక‌రిని ఒక‌రు ర‌క్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. 



కర్రలు, రాళ్లతో ఒక వర్గం కార్య‌క‌ర్త‌ల‌పై మరో వర్గం కార్య‌క‌ర్తలు దాడులు చేశారు. దీంతో గ్రామంలో యుద్ధ వాతావరణం నెల‌కొంది. ఇటీవ‌ల వెల్ల‌డ‌యిన ఎం.పి.టి.సి ఫలితాలు తరువాత పరిణామాలు మారాయ‌ని తెలుస్తోంది. శనివారం ఘటన జరిగినా ఇంత వరకు పోలీసులు తమను పట్టించుకోలేదని బాధితులంతాఆందోళన చెందుతున్నారు. గొడ‌వ‌లో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని విశాఖ కెజిహెచ్ కి తరలించారు. మ‌రో ఇద్దరికి విజయనగరం మహారాజ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: