ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది పెద్దల సామెత. నిజమే... అయితే అది ప్రస్తుతం వినియోగదారులకు మాత్రమే ఈ మాట వర్తిస్తుంది. ఆరుగాలం కష్టించి పండించిన రైతన్నకు అప్పులు తప్ప... కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. చివరికి కోత కూలీలు కూడా రాకపోవడంతో... చాలా మంది రైతులు పంటను కోయలో వద్దో అని ఆలోచిస్తున్నారు. ఈ ఏడాది ఉల్లి పంట మంచి దిగుబడులే సాధించింది. రకం మంచిందే.. అటు ఉల్లి సైజు కూడా బాగుందనేది మార్కెట్ వర్గాల మాట. కానీ రైతుకు మాత్రం పైసా ఆదాయం రావడం లేదు. పెట్టుబడి చూస్తే కొండంతగా ఉంటే... ఆదాయం చూస్తే... కనీసం రవ్వంత కూడా లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి పంటను తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేసేది కర్నూలు జిల్లాలోనే.

దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం ఉత్తరాధిలో ఉల్లి పంట ఘోరంగా దెబ్బ తిన్నది. దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ సారి కర్నూలు జిల్లా ఉల్లికి గిరాకీ బాగుంటుందని రైతులు భావించారు. కానీ పరిస్థితి తారుమారైంది. దళారులు రంగ ప్రవేశం చేయడంతో... చివరికి కోత కూలీలు కూడా రావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరా ఉల్లి పంట సాగుకు కనీసం లక్ష రూపాయల నుంచి లక్షా 25 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది ఎకరా పంట సాగు చేస్తే కనీసం 250 బస్తాల ఉల్లిపాయలు దిగుబడి వచ్చింది. దాదాపు వంద క్వింటాళ్ల ఉల్లి. ఈ పంటను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకెళ్తే... దళారులు ఇస్తున్న ధర చూసి రైతన్న బోరు మంటున్నారు. క్వింటా ఉల్లికి కేవలం 250 రూపాయలు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. అది కూడా గ్రేడింగ్ విధానం ద్వారా మాత్రమే. మొత్తం వంద క్వింటాళ్లకు కేవలం 25 వేల రూపాయలు మాత్రమే చేతికి వచ్చింది. చివరికి రానూపోనూ దారి ఖర్చులు, రవాణా ఛార్జీలు కూడా దక్కడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: