ప్రస్తుతం నేషనల్, ఇంటర్ నేషనల్ మీడియా దృష్టి అంతా ఒకే దగ్గర ఉంది. అదే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ చర్చల పైనే. ప్రపంచాన్ని ఓ వైపు కరోనా కుదిపేస్తుంటే... మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఇద్దరు అగ్ర దేశాధినేతలు సమావేశం కావడం కీలకంగా మారింది. ఈ రోజు జరిగే చర్చల్లో కూడా తాలిబన్ల వ్యవహారాన్ని మోదీతో బెడెన్ ప్రస్తావించే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఇదే సమయంలో తాలిబన్ల ప్రభుత్వానికి భారత్ దాయాది దేశం పాకిస్తాన్ అందిస్తున్న సాయంపై కూడా మోదీ అగ్రరాజ్యాధినేతకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఉగ్రవాదులకు అడ్డాగా మారిన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం... మోస్ట్ వాంటెండ్ క్రిమినల్స్‌తో నిండిపోయింది. ఇలాంటి సర్కారుకు పాకిస్తాన్ సపోర్టు చేయడం వల్ల అంతర్జాతీయంగా ఎలాంటి సమస్యలు వస్తాయో అనేదే ప్రస్తుతం కీలకంగా మారింది.

జో బెడెన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తొలి సారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అలాగే ఫస్ట్ టైమ్ వీరిద్దరు ముఖాముఖి చర్చించుకుంటున్నారు కూడా. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు అమెరికా వెళ్లిన మోదీ... అప్పట్లో డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. ఇక భారత పర్యటనకు వచ్చిన ట్రంప్ కోసం ప్రత్యేక ఏర్పాట్లను దగ్గరుండి మరి చేశారు మోదీ. అలాంటి భారత ప్రధాని... తొలిసారి బెడెన్‌తో సమావేశమ‌వుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ నుంచి అందుతున్న మద్దతుపైనే ప్రధానంగా చర్చించనున్నారు ఇరువురు నేతలు. ఆఫ్ఘాన్‌లో ప్రజా ప్రభుత్వం కూలిపోయేందుకు తాలిబన్లకు మద్దతు ఇచ్చిన ఏకైక దేశం పాకిస్తాన్. కాబుల్‌లో పాక్ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ పర్యటించడంపై ఇప్పటికే భారత్ తప్పుబట్టింది. ఇదే ప్రధాన అజెండాగా ఇరువురు నేతల మధ్య చర్చ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇలాగే పాకిస్తాన్‌కు అమెరికా అందిస్తున్న సాయం ఎలా దుర్వినియోగం అవుతుందో కూడా బెడెన్‌కు మోదీ వివరించే అవకాశం ఉంది. చూడాలి మరి... అగ్రరాజ్యాధినేత ఏ విధంగా స్పందిస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: