ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు.. తీవ్ర వివాదానికి దారితీస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా హిందూ ఆల‌యాల‌కు సంబంధించి.. తీసుకున్న నిర్ణ‌యాలు .. ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వాన్ని తీవ్ర‌స్థాయిలో ఇర‌కాటంలోకి నెట్టాయి. టీటీడీ బోర్డుకు సంబంధించి జంబో బోర్డు ఏర్పాటు చేయ‌డంతో.. జ‌గ‌న్ స‌ర్కారుకు త‌ల నొప్పులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కోర్టు కూడా.. జంబో బోర్డులో ప్ర‌త్యేక ఆహ్వానితుల ఏర్పాటుకు సంబంధించిన జీవోను కొట్టివేసింది. నిజానికి ఇప్ప‌టి వ‌రకు టీటీడీ బోర్డుకు సంబంధించి.. ఇలా జీవోలు కొట్టేసిన సంద‌ర్భాలు లేవు.

ఇక‌, ఈ వివాదం నుంచి తేరుకోక‌ముందే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం దేవాదాయ శాఖ ప‌రిధిలో ఉన్న బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను తీసుకువెళ్లి.. బీసీ సంక్షేమ శాఖ‌లో క‌లిపింది. ఇది తీవ్ర‌మైన అంశంగా రాజ‌కీయ నేత‌లు చెబుతున్నారు. ఎందుకంటే.. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ విధివిధానాలు అన్నీ కూడా దేవాదాయ చ‌ట్టానికి సంబంధించి ఏర్పాటు చేశారు. ఈ వ‌ర్గానికి అందిస్తున్న ఫ‌లాల‌ను కూడా.. దేవ‌దాయ శాఖ‌కు అనుబంధంగానే అమ‌లు చేస్తున్నారు. ఈ శాఖ‌కు చెందిన నిధులుకూడా వెచ్చిస్తున్నారు. ఇప్పుడు.. దీనిని బీసీ సంక్షేమ శాఖ‌లో చేర్చ‌డం అంటే.. జ‌గ‌న్ మ‌రో ప్ర‌తికూల నిర్ణ‌యం తీసుకున్న‌ట్టేన‌ని అంటున్నారు.

వాస్త‌వానికి దేవాల‌యాల‌ను టార్గెట్ చేసుకుని జ‌రిగిన దాడుల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ జ‌గ‌న్ ప్ర‌భు త్వాన్ని టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కూడాటీటీడీ బోర్డు విష‌యంలో తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. న్యాయ‌పోరాటం చేసింది కూడా.. బీజేపీ నాయ‌కుడు భాను ప్ర‌కాశ్ రెడ్డే కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు మ‌రోసారి బీజేపీ నేత‌ల‌కు జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీకులు.

ఎట్టి ప‌రిస్థితిలోనూ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను బీసీ సంక్షేమ ప‌రిదిలోకి చేర్చ‌డాన్ని వారు ఒప్పుకొనే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌రో న్యాయ‌పోరాటానికి బీజేపీ నేత‌లు సిద్ధ‌మ‌య్యే ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. మ‌రోసారి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కోర్టు నుంచి మొట్టికాయ‌లు త‌ప్ప‌వ‌నే చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: