జగన్ ఇలాకాలో టిడిపి జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 తర్వాత ఏ ఎన్నికలు జరిగినా కూడా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన జగన్ పార్టీ ఉప ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగించింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కేవలం ఒకే ఒక్క స్థానం దక్కింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పంచాయితీ పోరులో సైతం ఫ్యాన్ హవా కొనసాగింది. ఇక పరిషత్ పోరులో దాదాపు 99 శాతం పైగా సీట్లు వైసీపీ ఖాతాలో చేరాయి.

అయితే సీఎం వైయస్ జగన్  నివాసముండే మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎంపీపీ ఎన్నికకు కావలసిన కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు. దుగ్గిరాల మండల పరిధిలో తెలుగుదేశం పార్టీకి తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉండగా వైసిపి మాత్రం ఎనిమిది ఎంపీటీసీలు గెలుచుకుంది. ఎంపీపీ ఎన్నికకు హాజరుకావాల్సిన సమయంలో లో టిడిపి సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో కోరం లేదని అధికారులు ప్రకటించారు. అయితే ఇదే సమయంలో టిడిపి ఎంపీటీసీల పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఎంపీటీసీ లను టిడిపి ప్రలోభాలకు గురిచేస్తోందని ఆళ్ల ఆరోపించారు. తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్నా కూడా టిడిపి ఎందుకు ఎన్నిక కి హాజరు కాలేదని అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ వర్గానికి రిజర్వు అయిందని... అయితే టిడిపిలో బీసీ వర్గానికి చెందిన సభ్యులు లేకపోవడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఇద్దరు బిసి ఎంపీటీసీ సభ్యులను తమ పార్టీలోకి లాక్కునేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందని ఆళ్ల ఆరోపించారు. ఎంపీ పదవికి ఇప్పటికే వైసిపి తరఫున గెలిచిన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారన్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.‌ దుగ్గిరాల ఎంపీపీ తో పాటు కో ఆప్షన్ సభ్యులుగా కూడా వైసిపి నేతలే ఎన్నిక అవుతారని ఆళ్ల ధీమా వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: