తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రాజకీయం రంజుగా మారింది. కాకినాడ తెలుగుదేశం పార్టీ మేయర్ సుంకర పావనిని గద్దె దించడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నిజానికి టీడీపీ మేయర్ పావని పదవీకాలం వారం క్రితమే పూర్తయింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. కాకినాడ కార్పొరేషన్ పాలక వర్గం మాత్రం తెలుగుదేశం పార్టీ చేతిలోనే ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన మేయర్ సుంకర పావని ఎలాగైనా సరే అన్నది స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఆలోచనగా ఉంది. ఇందుకోసం ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారన్న చర్చ కూడా సాగుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కాకినాడలో టీడీపీ మేయర్ పావనిని గద్దె దించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రయత్నించారట. అయితే నాలుగేళ్ల వరకు మేయర్‌ను దించడానికి చట్టం అడ్డుగా ఉండటంతో ఆయన ఓపికగా ఉన్నారట. ఇప్పుడు ఆ పదవీ కాలం పూర్తి కావడంతో తన పంతం నెగ్గించుకోవాలని ద్వారంపూడి వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కలిశారట. కాకినాడ మేయర్ మార్పునకు అనుమతి ఇవ్వాలని కూడా ఆయన అడిగినట్లు సమాచారం. సీఎం జగన్‌తో భేటీ తర్వాత కాకినాడలోని తన కన్వెన్షన్ హాలులో వైసీపీతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లతో ఎమ్మెల్యే ద్వారంపూడి రహస్యంగా భేటీ అయ్యారు. మేయర్‌ పావనిని గద్దె దింపేందుకు కార్పరేటర్లందరూ సహకరించాలని కోరినట్లు సమాచారం.

ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్‌లో సంఖ్యా బలం ప్రకారం చూస్తే.. కొత్త మేయర్‌ను అధికార వైసీపీ నుంచి ఎంపిక చేసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల రెండో డిప్యూటీ మేయర్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపిక చేసినట్టుగానే ఆ పార్టీ నుంచే తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని మేయర్‌గా ఎంపిక చేసుకోవాలని ఎమ్మెల్యే ద్వారంపూడి పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే అందుకు వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు విముఖత కనబరుస్తున్నారు. కానీ కాకినాడ కార్పొరేషన్‌లో పార్టీకి తగినంత సంఖ్యాబలం లేనందున వారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మేయర్‌ను గద్దె దించితే.. ఆ సామాజిక వర్గంలో పార్టీ పట్ల అసంతృప్తి పెరుగుతుందని వారు కలత చెందుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రయత్నాలపై ప్రస్తుత మేయర్ సుంకర పావని ఏం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి మద్దతు పొంది ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? లేక ఒంటరి పోరాటం చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: