జాతీయ స్థాయిలో డిజిటల్ హెల్త్ మిషన్ అమలకు సిద్ధమైంది మోడీ సర్కార్. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో హెల్త్ మిషన్ అమలుచేసేందుకు రంగం సిద్ధం చేసింది. డిజిటల్ హెల్త్ మిషన్ పై ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సమాచారం కూడా అందించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనేది మోడీ ప్రభుత్వం లక్ష్యం. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీ, సోమవారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో అర్హులైన ప్రతి పౌరునికి హెల్త్ కార్డ్ అందించేలా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది హెల్త్ కార్డులో ఆ పౌరుని పూర్తి ఆరోగ్య సమాచారం ఉండేలా హెల్త్ కార్డు రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టును గతేడాది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 తారీకు ఎర్రకోటపై జరిగిన ప్రసంగంలో మోడీ ప్రస్తావించారు. దాదాపు ఏడాది తర్వాత ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. హెల్త్ కార్డు లో ఆరోగ్య సమాచారం తో పాటు రోగికి జబ్బు చేసినప్పుడు అందించే వైద్యం, తీసుకోవలసిన మందులు, జాగ్రత్తలు అలాంటి వివరాలు కూడా ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ముందుగా దేశంలోని ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అండమాన్, నికోబార్, లక్షద్వీప్ దీవులతో పాటు పుదుచ్చేరి, చండీఘడ్, లడఖ్, డయ్యూ, డామన్, దాద్రానగర్ హవేలీ ల్లో అమలు చేస్తున్నారు. క్రమంగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఈ పథకాన్ని విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ తిరిగివచ్చిన వెంటనే సోమవారం జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ భాయ్ మాండవీయ వెల్లడించారు. హెల్త్ మిషన్ కింద ప్రతి ఒక్కరికి  ఐ డి నెంబర్ అందిస్తామని దానిద్వారా ఆన్లైన్ లోనే వారి ఆరోగ్య సమాచారం తెలుసుకోవచ్చని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఇప్పటికే దాదాపు 75 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ముందుగా అప్రమత్తంగా ఉండటం వల్ల మాత్రమే కొవిడ్ అరికట్టగలమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: