ఉత్త‌రాంధ్ర‌లోని కీల‌క‌మైన శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ ప‌రిస్థితి ఏంటి? అంటే.. ఒక అడుగు ముందు కు.. నాలుగు అడుగులు వెన‌క్కి.. అన్న‌చందంగా మారిపోయింది. ఎవ‌రికి వారు మేమే హీరోలమంటే.. మేమే అంటూ.. పార్టీని బ‌ద్నాం చేస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం అయ్యేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఇక్క‌డ టీడీపీ బ‌లంగా ఉంది. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, మాజీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు వంటి కీల‌క నాయ‌కులు ఉన్నారు. సో.. దీనిని బ‌ట్టి వైసీపీ నాయ‌కులు సంఘ‌టితంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

ఏమాత్రం తేడా వ‌చ్చినా.. వైసీపీ ద‌క్కించుకున్న సీట్లు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉండే అవ‌కాశం లేదు. కానీ, ఎవ‌రూ మాత్రం ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. ఎవ‌రికివారుగానే రాజ‌కీయాలు చేసుకుం టున్నారు. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.. రాష్ట్రానికి మంత్రిగా కాకుండా.. నియోజ‌క‌వ‌ర్గానికి మంత్రి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. అదేవిధంగా స్పీక‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆముదాల వ‌ల‌స‌కే ఆయ‌న ప‌రిమిత‌మ‌వుతున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. మ‌రోమంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ప‌రిస్థితి కూడా అలానే ఉంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న‌ను ఎవ‌రూ లెక్క‌చే య‌డం లేద‌ని అంటున్నారు. పైకి మాత్రం ప్రొటోకాల్ మ‌ర్యాద‌లు పాటిస్తున్నా.. వెనుక మాత్రం ఆయ‌న మాట‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, పార్టీలో కీల‌క నాయ‌కురాలు.. కేంద్ర మాజీ మంత్రి కిల్లికృపారాణి ప‌రిస్థితి కూడా ఇలానే వుంది.ఇటీవ‌లే ఎమ్మెల్సీ అయిన‌ దువ్వాడ  శ్రీనివాస్ దూకుడు.. గా ముందుకు సాగుతున్నారు. అయితే.. సొంత పార్టీ నేత‌ల‌పైనే ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. కీల‌క నేత‌ల‌ను కూడా పూచిక పుల్లలుగా తీసిపారేస్తుండ‌డం వంటివి.. పార్టీలో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో.. శ్రీకాకుళంలో వైసీపీ నేత‌ల వ్య‌వ‌హారాన్ని సైలెంట్‌గా గ‌మ‌నిస్తున్న టీడీపీ నాయ‌కులు.. వారిలో వారే.. కొట్టుకుని పోతే.. మ‌నం పుంజుకునేందుకు ఎలాంటి ఇబ్బందీ లేద‌ని.. భావిస్తున్నారు. అందుకే.. వైసీపీ లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను టీడీపీ నేత‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇలానే ఉంటే.. వైసీపీ నిజంగానే ఇబ్బందులు తెచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: