క‌రోనా  ఎఫెక్ట్‌!  ఈ విష‌యం త‌లుచుకుంటేనే మ‌ధ్య‌త‌ర‌గతి నుంచి పేద‌లకు క‌న్నీళ్లు వ‌స్తాయి. అన్ని ప‌ను లు ఆగిపోయాయి. ఉద్యోగాలు పోయాయి. ఉపాధి క‌నుమ‌రుగైంది. ఆదాయాలు త‌గ్గిపోయాయి. ఉద్యోగుల‌కు స‌గం జీత‌మే ద‌క్కింది. దీంతో అప్పులు పెరిగి.. సామాన్యుల జీవితంతోపాటు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల జీవితం కూడా త‌ల‌కిందులైంది. అయితే.. దేశ ప్ర‌ధాని.. న‌రేంద్ర మోడీ ఆదాయం మాత్రం పెరిగింది. ఆయ‌న‌పై క‌రోనా ఎలాంటి ఎఫెక్ట్ చూపించ‌లేదు. స‌రిక‌దా.. ఆయ‌న ఆదాయాన్ని మ‌రింత పెంచింది. గ‌తంలో ఉన్న ఆస్తుల కంటే కూడా ప్ర‌ధాని మోడీ ఆదాయం 22 ల‌క్ష‌లు పెరిగింది.

ఇది ఈ ఒక్క ఏడాది లెక్కే!  ఏటా జూల్‌-ఆగ‌స్టు స‌మ‌యంలో ప్ర‌ధాని త‌న ఆస్త‌లు వివ‌రిస్తారు. అయితే.. ఈ ద‌ఫా మాత్రం ఒకింత ఆల‌స్య‌మైంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు మీడియాకు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. క‌రోనా దేశాన్ని కుదిపేసిన 2020 సంవ‌త్స‌రంలో  22 ల‌క్ష‌ల మేర‌కు మోడీ ఆదాయం పెరిగింది. ఇది.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రూ. 2 .85 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువన‌ను 3 కోట్ల 7 లక్షల రూపాయలకు చేర్చింది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రి త‌న నెల జీతం కింద రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు పైనే తీసుకుంటున్నారు. అంటే.. మోడీ.. త‌ను తీసుకునే జీతం నుంచి ఒక్క‌రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌డం లేద‌న్న‌మాట‌.

ఇక‌, ఇతర విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. మోడీకి   స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లేక‌పోయినా.. ప్రభుత్వం నుంచి పొందే రూ.రెండు లక్షల పైచిలుకు జీతం.. మాత్రం ఆయ‌న దాచేస్తున్నారు.  దాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటి వల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల మోడీ ఆదాయం పెరిగింద‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో నేషనల్ సేవింగ్స్(8.9 లక్షల రూపాయ‌లు), ఎల్ఐసీ పాలసీలు(1.5 లక్షల రూపాయ‌లు), ఎల్&టీ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టారు. మొత్తంగా.. చూస్తే.. మోడీ ఆదాయం క‌రోనా స‌మ‌యంలోనూ పుంజుకోవ‌డం.. ఆర్థిక వేత్త‌ల‌ను కూడా నివ్వెర పోయేలా చేస్తోంది.

గుజరాత్ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో మోడీకి ఫిక్స్డ్ డిపాజిట్ లు ఉన్నాయి.  గతేడాది ఫిక్స్డ్ డిపాజిట్ విలువ రూ. 1.6 కోట్లు ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి అది రూ. 1.86 కోట్లకు చేరింది. ఇక‌, ఈ ఏడాది  మార్చి 31 నాటికి మోడీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ లక్షా 48 వేల రూపాయలు. బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 1.5 లక్షలు. నగదు రూపంలో రూ. 36 వేలు ఉన్నాయి.

2014లో ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటివరకు మోడీ ఎలాంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయలేదు. 2002లో కొనుగోలు చేసిన ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ విలువ రూ. 1.1 కోట్లుగా ఉంది. అయితే ఇది ఉమ్మడి ఆస్తి. మరో ముగ్గురికి ఇందులో వాటా ఉంది. మ‌రోవైపు.. దేశ ప్ర‌ధాని అయిన‌ప్ప‌టికీ.. త‌న వ‌ద్ద సొంత వాహ‌నం అంటూ.. ఏమీ లేద‌ని..క‌నీసం మోపెడ్ కూడా  లేద‌ని.. ప్ర‌ధాని తాజాగా ఇచ్చిన డిక్ల‌రేష‌న్‌లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: