ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే ఎంత ర‌చ్చ జ‌రగాలో అంత ర‌చ్చా జ‌రిగింది. పశుసంవర్థక మంత్రి మీడియా ఎదుట‌కు వ‌చ్చి అలాంటి ఆలోచనలేదని, అలా ప్రచారం చేసింది ఎల్లో మీడియా అని, త‌మ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్ల‌డానికే ఇటువంటి ప్ర‌చారం చేస్తున్నారంటూ  విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. అస‌లు అనాలోచిత‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మెందుకు.. ఆ త‌ర్వాత వాటితో త‌మ‌కు సంబంధం లేదంటూ గిట్ట‌ని మీడియాపైకి నెట్టేడ‌యం ఎందుకు?

జ‌గ‌న్ దారిలోనే కేసీఆర్‌?
అయితే ఇప్పుడు మ‌ట‌న్ మార్ట్ ల‌పై తెలంగాణ ప్రభుత్వం ఆలోచ‌న చేస్తోంది. ప్రత్యేకంగా మటన్ మార్టులు అని చెప్పకపోయినా మటన్ దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు వధశాలలు ఏర్పాటు చేయాలని ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. వీటిని స్థానికంగా ఉండే మటన్ షాపులకు క‌లుపుతారు. అక్కడి నుంచి వినియోగదారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. మటన్ దుకాణాల యజమానులు కూడా ప్రభుత్వం సరఫరా చేసే మటన్‌నే ఇక‌నుంచి అమ్మాల్సి రావొచ్చు. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధ‌మ‌వ‌గా ప్రభుత్వం తుది అనుమలు ఇవ్వ‌డానికి ఏర్పాట్లు చేస్తోంది.

ప్ర‌జ‌ల‌కు స్వ‌చ్ఛ‌మైన మ‌ట‌న్‌!
తెలంగాణ ప్రభుత్వం మేకలు, గొర్రెల యూనిట్లను పెద్ద ఎత్తున లబ్దిదారులకు రాయితీపై పంపిణీ చేస్తోంది. వాటి వల్ల భారీగా ఉత్పత్తి కూడా ఉంటుంది. ప్రజల అవసరాల మేరకే ప్రభుత్వం పంపిణీ చేసిన మేకలు, గొర్రెల పథకం ఉపయోగపడాలని.. ఎక్కువైతేనే ఎగుమతి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ యూనిట్ల లబ్దిదారులకు మెరుగైన ధ‌ర‌లు వచ్చేలా చూడటం.. ప్రజలకు స్వ‌చ్ఛ‌మైన మటన్ అందేలా చూసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ‌ట‌న్ మార్ట్ ల విష‌యంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గ‌దు. మ‌ట‌న్ షాపుల‌మీద ఆధార‌ప‌డి జీవిస్తున్న‌వారిని ఏం చేస్తారో చూడాలి మ‌రి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: