ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.  సరిగ్గా రెండున్నర ఏళ్ల క్రితం ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.... ఇప్పుడు కీలక మార్పులు చేయబోతోంది. అధికారంలోకి వచ్చిన రోజే పార్టీ నేతలకు తేగేసి చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... చెప్పినట్లుగానే చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పడుతున్న మంత్రివర్గం సరిగ్గా రెండున్నర ఏళ్ల వరకు మాత్రమే ఉంటుందని... ఆ తర్వాత కొత్త వారికి అవకాశం ఉంటుందన్నారు. ఎవరూ నిరాశ పడవద్దని కూడా చెప్పారు. చెప్పినట్లుగానే ఈ నెల 16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇదే విషయాన్ని సహచర మంత్రులకు తేల్చి చెప్పేశారు కూడా. ప్రస్తుతం పదవులకు దూరంగా ఉంటున్న నేతలు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. అయితే ఆ రోజే 80 శాతం మందిని మారుస్తున్నట్లు వెల్లడించారు. సీనియర్లు హమ్మయ్య అనుకున్నారు. కానీ తాజాగా మరో బాంబు పేల్చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తర్వాత జిరిగే మంత్రివర్గ కూర్పులో మొత్తం కొత్త వారే ఉంటారని క్లారిటీ ఇచ్చేశారు.

పని తీరు, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని మంత్రులను మారుస్తామన్నారు వైఎస్ జగన్. ఈ కామెంట్ల నేపథ్యంలో ఉండేదెవరో... పోయేదెవరో అనే లెక్కలు వేసుకుంటున్నారు పార్టీ నేతలు. మరి కొంతమంది అయితే నాకు ఈ సారి అవకాశం తప్పకుండా వస్తుందని ఆశ పడుతున్నారు. తొలి కేబినెట్ ఏర్పాటు సమయంలో ప్రాంతీయ, సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్ జగన్... విస్తరణ సమయంలో కూడా అలాగే వ్యవహారిస్తారని అంతా భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనే ఉంటుందని కొందరంటుంటే... దసరా రోజుల్లోనే ముహుర్తం ఖరారు చేస్తారనేది మరికొందరి మాట. ఇదే సమయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గం  మొత్తం కొత్త వారితో ఏర్పాటవుతుందని  వెల్లడించారు. పాత వారిని పూర్తిగా తొలగించి... కొత్తవారికి అవకాశం ఇచ్చేలా జగన్ ప్లాన్ చేసినట్లు మంత్రి బాలినేని తెలిపారు. ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే కట్టుబడి ఉంటామన్నారు బాలినేని. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు కావడంతో... ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కనీసం ఒక్కరికి కూడా ప్రస్తుత మంత్రులకు అవకాశం ఉండే ఛాన్స్ లేదని మంత్రి బాలినేని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: