ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డిని క్యాబినెట్‌ నుంచి తప్పిస్తారా? ఈ విషయాన్ని ఆయనకు ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పారా? అందుకే ఆయన మంత్రి పదవి పోయినా నేను భయపడేది లేదని అన్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ముఖ్యఅతిథిగా వెళ్లారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ను ఎన్నుకున్న తర్వాత అక్కడ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు ఉంటాయని ఆయన అన్నారు. మంత్రివర్గంలో వంద శాతం మార్పులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గుర్తు చేశారు ప్రభుత్వ విధానాలు సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రితో తాను ఇప్పటికే చెప్పానని ఆయన వెల్లడించారు. మంత్రి పదవి పోయినా నేను భయపడేది లేదని బాలినేని స్పష్టం చేశారు. పదవులు కాదు ముఖ్యం నాకు పార్టీ ముఖ్యమని ఆయన అన్నారు.

నిజానికి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలోనే.. రెండున్నర ఏళ్ల తర్వాత తన మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ గడువు సమీపిస్తోంది. అయితే ఇప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు అధికార వైసీపీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాట మేరకు తాను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారు అన్న ప్రచారం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న నేపథ్యంలో తాజాగా బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరోవైపు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఓ వర్గం మరో ఏడాది వరకు మంత్రివర్గ విస్తరణ ఉండబోదు అని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో నవంబరు- డిసెంబరులో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది లాంటి చర్చ మళ్లీ జోరందుకుంటోంది.  అంతేకాదు మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇటీవల చేసిన విదేశీ ప్రయాణం అంశం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో విద్యుత్‌కు సంబంధించి గొడవ జరుగుతుంటే.. మంత్రి బాలినేని విదేశీ పర్యటనలు చేయడం ఏమిటి? ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బాలినేనిని క్యాబినెట్‌ నుంచి తొలగించడం దాదాపు ఖాయమై పోయిందా? ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయనకు ముఖ్యమంత్రి వైపు నుంచి సమాచారం వచ్చిందా? అందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అనే చర్చ కూడా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: